స్థానిక ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్‌లోని ఖానాపూర్ చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. ఒకప్పుడు 189 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ తటాకం... సుమారు 75ఎకరాలకు పైగా కబ్జాకు గురై ప్రస్తుతం 114 ఎకరాలకు పరిమితమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో భూగర్భజలాల పెంపుదలకు ఊతమిచ్చే ఈ చెరువు.. క్రమంగా కుచించుకుపోవడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మిషన్ కాకతీయ కింద రూ.4.83 కోట్లు..
ఆదిలాబాద్‌లో పలు కాలనీలను ఆనుకొని ఉన్న ఖానాపూర్ చెరువు కట్టను రింగురోడ్డుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద రూ.4.83 కోట్ల నిధులను సైతం కేటాయించింది. రింగురోడ్డు నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్, నడకదారితో సుందరీకరణ చేయాలనే ప్రతిపాదనా ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు ఆక్రమణలతో పాటు గుర్రెపు డెక్క, చెత్తాచెదారంతో నిండి తటాకం ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వం మంజూరుచేసిన నిధులు గుత్తేదారులకు లబ్ధిచేయడం మినహా చెరువు బాగుకు ఉపయోగపడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆచరణలో లేని ప్రణాళిక..
చెరువు శిఖం భూముల్లోనే అక్రమంగా కట్టుకున్న ఇళ్లలోకి వర్షాకాలంలో వరదనీరు వచ్చిచేరుతోంది. ఆక్రమణదారులకు ప్రత్యామ్నాయం చూపాలనే అధికారుల ప్రణాళిక ఏదీ ఆచరణలోకి రాలేదు. చెరువు నిండినప్పుడల్లా కొన్ని చోట్ల కట్టను తెంపి లోతట్టు ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. ఆక్రమణలపై అధ్యయనం చేసిన అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెబుతున్నారు.
ఇవీ చూడండి: 3 రోజులైనా కానరాని పెద్దపులి జాడ... కొనసాగుతున్న గాలింపు