ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్య కళాశాల ఉమ్మడి జిల్లా ఆరోగ్యసంజీవినిగా ప్రసిద్ధి పొందినప్పటికీ అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా అభాసుపాలవుతోంది. కొవిడ్ బాధితుల కోసం నిరుడు ఏర్పాటుచేసిన వార్డులో మూడు విభాగాలుండేవి. లక్షణాలు కలిగిన వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చేదాకా ఉంచే ఐసోలేషన్ వార్డు, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రత్యేకవార్డు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండేవారి కోసం ఐసీయూ వార్డు ఉండేది. ప్రస్తుతం వాటన్నింటికి బదులు... ఒకే వార్డులో అందరినీ ఉంచడం గందరగోళానికి కారణమవుతోంది.
వెంటిలేటర్‌పై కొన ఊపిరితో ఉండేవారిని.. సాధారణ లక్షణాలు కలిగిన బాధితుల మధ్య ఉంచటం వల్ల తీవ్రంగా భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నా... అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు ఉండటం విమర్శలకు తావిస్తోంది. గతంలో కొవిడ్ వార్డు పర్యవేక్షణ కోసం నియమించిన 157 వైద్య సిబ్బందిని సైతం ఇతర విభాగాల్లో కేటాయించడం వల్ల ప్రస్తుతం... బాధితులకు ఆశించిన వైద్యం అందడంలేదు.
జిల్లాలో దాదాపు ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరుకుంది. రిమ్స్‌లో చేరే వ్యాధిగ్రస్తులంతా సామాన్యులే కావడం వల్ల అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీపీఈ కిట్లు, గ్లౌజులు, మందులు సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల కూడా... అంకితభావంతో పనిచేసే వైద్యులు, వైద్యసిబ్బంది సైతం వ్యాధిభారిన పడాల్సి వస్తోంది.