సోఫా సెట్టు... డ్రెస్సింగ్ టేబుల్... ఇంట్లో సీలింగ్ ... తలకు ధరించే టోపి... చొక్కాలు తగిలించే కొయ్య... నీళ్లు నింపుకొనే బాటిల్... వెలుగులు విరజిమ్మే జూమర్... ఇలా ప్లాస్టిక్, రసాయనాలతో తయారయ్యే ఎన్నో ఉపకరణాలను....ప్రకృతిలో దొరికే వెదురుతో రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నాడు ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన కిరణ్. చిన్నప్పటి నుంచే అందరికీ భిన్నంగా ఆలోచించే మనస్తత్వమే....ఆయణ్ను కళాకారుడిగా మలిచింది. మన రాష్ట్రంతో పాటు అస్సాం నుంచి తెప్పించే వెదురుతో ఎన్నో కళాకృతులను రూపొందించేలా చేసింది. పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు మొదలుకొని.... ప్రకృతి ఒడిలో కూర్చున్న అనుభూతిని పంచే వెదురు ఇంటి నిర్మాణం వరకూ అలవోకగా రూపొందించడం కిరణ్ ప్రత్యేకత.
ప్రసిద్ధి పొందిన కళాకృతులు...
స్వతహాగా నేర్చుకున్న వెదురు హస్తకళనే జీవనాధారంగా మార్చుకుని....కిరణ్ రూపొందించిన కళాకృతులు ఎన్నో విధాలుగా ప్రసిద్ధిపొందాయి. హైదరాబాద్ సహా కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలాంటి ప్రాంతాలకు వెళ్లి తన కళానైపుణ్యంతో పనిచేస్తుంటాడు. ఆయన తయారుచేసే కళాకృతులన్నీ వెదురువే. కావాలంటే మొత్తం ఇంటిని వెదురుతోనే నిర్మించి ఇస్తానని చెబుతున్నాడు. చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తున్న తరుణంలో....ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే రాష్ట్రానికి గుర్తింపు వచ్చేలా కళాకృతులు తయారుచేస్తాననే విశ్వాసం కిరణ్‌లో వ్యక్తమవుతోంది.
ఆకట్టుకుంటోన్న వాటర్ ఫౌంటెయిన్...
తాజాగా ఆదిలాబాద్ శాంతినగర్‌లోని సాయిబాబా ఆలయం ఎదుట జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి వెదురు వాటర్ ఫౌంటెయిన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఓ చిన్న ఇంటిలాంటి నిర్మాణంలోంచి నీళ్లు తోడుతున్న విధానం, అదే నీరు బొంగులద్వారా శుద్ధి అవుతున్న తీరు అంతా కళాత్మకంగానే ఉంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వెదురుతో కొన్ని కళాకృతుల ఏర్పాటుకూ మున్సిపల్ యంత్రాంగం ఆలోచన చేస్తోంది.