Gold Price Today: 2022 సంవత్సరపు మొదటి 6 నెలల్లో బంగారం ధర 6.5 శాతం లాభపడింది. స్టాక్ మార్కెట్‌ను కూడా మించిపోయింది. ఇతర ఆస్తి తరగతులతో పోలిస్తే బంగారంపై రాబడి ఇప్పటికీ స్వల్పంగానైనా సానుకూలంగానే ఉంది. పెట్టుబడిదారులు ఆర్ధిక వృద్దిపై పాలసీ ప్రభావాన్ని అంచనా వేయడంతో బంగారం ధర రాబోయే కొద్ది నెలల పాటు మంచి శ్రేణిలోనే కొనసాగవచ్చు. భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 2022 మొదటి 6 నెలల్లో దాదాపు రూ. 3,000 పెరిగింది. 2022 జనవరిలో దాదాపు రూ. 48,243 ధర ఉన్న బంగారం ఈ జూన్ 2022లో దాదాపు రూ. 51,243గా ఉంది. ఇది దాదాపు 6.5% లాభ వృద్దితో సమానం.
ఈ బంగారం ధర వృద్ధికి విరుద్దంగా 2022 ప్రారంభం నుంచి ఈక్విటీలు క్రింది స్థాయిని చూశాయి. నిఫ్టీ 50 గత 6 నెలల్లో దాదాపు 12% క్షీణించింది. ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు నుండి రష్యా- ఉక్రెయిన్ యుద్దం వరకు అనేక అంశాలు బంగారం ధరలకు ముడిపడి ఉన్నాయి. ఈక్విటీలు, బాండ్లు వంటి ఇతర ఆస్తి తరగతులతో పోలిస్తే బంగారంపై ఈ ఏడాది మొదటి నుండి ఇప్పటి వరకు రాబడి సానుకూలంగానే ఉంది. అయితే మిగతా ఆస్తి తరగతులు ప్రతికూల రాబడిని సృష్టించాయి. స్టాక్‌ల కంటే కూడా బంగారంలో మెరుగైన పనితీరు కనిపిస్తోంది కానీ బంగారం ధరలు ఇంకేమైనా నిలదొక్కుకుంటాయో లేదో చూడాలి. ఆర్ధిక వృద్ధిపై పాలసీ ప్రభావాన్ని పెట్టుబడిదారులు అంచనా వేయడంలో ధరలు రాబోయే కొద్ది నెలల పాటు మంచి శ్రేణిలో కొనసాగవచ్చు.
ద్రవ్యోల్బణం కొనసాగినా, స్థిరపడిపోయినా ఈ బంగారం ధరలు ఇంకా ముందుకు వెళ్లడం చూడవచ్చు. భారత్‌లో బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ బంగారం ధరల పనితీరు, అమెరికా వడ్డీ రేట్లు, ఇతర ప్రపంచ కారకాలపై ఆధారపడి ఉంటాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణించడం బంగారాన్ని ఉన్నత పరిస్థితుల్లోనే ఉంచుతుంది. అమెరికాలో ఇప్పటికే ద్రవ్యోల్బణం చారిత్రాత్మకంగా అధిక స్థాయిలో ఉండటంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంకు డిసెంబర్ 2022 నాటికి 200 కంటే ఎక్కువ బేసిస్ పాయింట్ల రేటు పెంపుకు వెళ్లాలని భావిస్తుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెంపుతో బంగారం ధరల పెరుగుదల పరిమితం కావచ్చు. అమెరికా కీలక ఆర్ధిక గణాంకాలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలను దిశానిర్ధేశం చేస్తాయి.
అయినప్పటికీ, రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దం, ద్రవ్యోల్బణ ఆందోళనలకు దారితీసే సంక్షోభం పరిస్థితుల కారణంగా బంగారం పరిస్థితి ఇంకా బలంగా ఉండొచ్చు. ఆర్ధిక వృద్ది మందగించడంతో పాటుగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది బంగారం ధరలకు మంచి సూచన. అలాగే జూన్, ఆ తర్వాత ఆర్‌బీఐ మళ్లీ రేట్లు పెంచుతుందని అంచనా వేయడంతో, స్టాక్, డెట్ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతుంది. అందువల్ల పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని బంగారానికి కేటాయించడం వల్ల పెట్టుబడిదారుల స్థూల ఆర్ధిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నుండి బయటపడవచ్చు.
ఇవీ చూడండి: వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. మరి పెట్టుబడుల సంగతేంటి?
'పసిడి'పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?