Unacademy Roman Saini Success story : భారతదేశంలో ఎంతో మంది యువతీయువకులకు ఐఏఎస్ సాధించడం ఒక కల. అందుకోసం ఏళ్ల తరబడి, ఎంతో ఏకాగ్రతతో చదువుతూ ఉంటారు. అలాంటిది ఒక అబ్బాయి కేవలం 22 ఏళ్లకే యూపీఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై.. నేరుగా ఐఏఎస్‌కు ఎంపిక అయ్యాడు. కొన్నాళ్లు సివిల్ సర్వెంట్‌గా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాడు. కానీ అది తనకు సరిపడదని గ్రహించిన ఆ యువకుడు.. దానిని వదిలేసి, తన స్నేహితులతో కలిసి ఒక ఎడ్-టెక్ ప్లాట్‌ఫాంను స్థాపించాడు. తరువాత దానిని అంచెలంచెలుగా రూ.2600 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దాడు. అతనే రోమన్ సైనీ.
షార్ప్ మైండ్
Roman Saini life story : భారతదేశంలోని మంచి ప్రతిభావంతులైన యువకుల్లో రోమన్ సైనీ ఒకరు. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యాడు. ఎలాంటి ఆటంకం లేకుండా ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసి వైద్యునిగా పట్టా అందుకొన్నాడు. తరువాత నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్లో 6 నెలలపాటు పనిచేశాడు.
రోమన్ సైనీ వైద్య విద్య పూర్తి చేసి, అనుభవం సంపాదించిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షలపై దృష్టి పెట్టారు. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణుడై, ఐఏఎస్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లో జిల్లా కలెక్టర్‌గా సేవలు అందించారు.
యూట్యూబ్ ప్రస్థానం
Unacademy YouTube channel : కలెక్టర్‌గా ఉన్న సమయంలోనే తన స్నేహితులు గౌరవ్ ముంజాల్, హిమేష్ సింగ్‌లతో కలిసి.. యూట్యూబ్‌లో సివిల్ సర్వీస్‌కు సంబంధించి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు రోమన్ సైనీ. ఇందుకోసం 'అన్అకాడమీ' అనే ఛానల్ పెట్టారు. సివిల్స్ సాధించాలని తపించే యువతకు ఈ వేదిక ద్వారా ఉచితంగా పాఠాలు చెప్పారు. దీనికి దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతో మంది అభ్యర్థులు కేవలం అన్అకాడమీ ప్లాట్‌ఫాం ఉపయోగించుకుని సివిల్స్ సాధించారంటే, అతిశయోక్తి కాదు.
అన్అకాడమీ - కంపెనీ
Unacademy Business : వాస్తవానికి యూట్యూబ్‌లో అన్అకాడమీ ఛానల్ బాగా పాపులర్ అయిన తరువాత దానిని బిజినెస్‌గా మార్చాలని రోమన్ సైనీ స్నేహితుడు గౌరవ్ ముంజాల్ భావించారు. అనుకున్నదే తడవుగా ప్రత్యేకంగా అన్అకాడమీ కంపెనీ స్థాపించారు. ఆన్లైన్లో సివిల్ సర్వీస్ ఉద్యోగార్థులకు కోచింగ్ ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. తరువాత కాలంలో ఇదే వేదిక నుంచి మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు కూడా కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ముఖ్యంగా జేఈఈ, నీట్, గేట్, సీఏ తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు పోటీ పరీక్షలతో పాటు, రెగ్యులర్ అకడమిక్ కోర్సులకు కూడా శిక్షణ ఇస్తున్నారు.
ఈ విధంగా దినదినాభివృద్ధి చెందిన అన్అకాడమీ కంపెనీ నేడు రూ.2600 కోట్ల విలువైన కంపెనీగా మారింది. బిజినెస్ ఐడియా గౌరవ్ ముంజాల్దే అయినా ఈ ఘనమైన ప్రస్థానానికి మూలం మాత్రం రోమన్ సైనీనే.