Twitter Verified Tick : డిసెంబరు 2వ తేదీ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వెరిఫైడ్ ప్రక్రియను ట్విట్టర్ ప్రారంభించనుంది. కంపెనీలకు పసిడి రంగులో, ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగులో, వ్యక్తులకు నీలి రంగులో టిక్ ఇవ్వనున్నారు. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే.. ఈ వెరిఫైడ్ టిక్‌ను కేటాయిస్తామని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై పూర్తి వివరాలను వచ్చేవారం వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్వేష వార్తల కట్టడి గురించి మస్క్ ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు.
మస్క్ చేతికి ట్విట్టర్ రాకముందు.. ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాకే బ్లూటిక్ ఇచ్చేవారు. అయితే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్.. ఈ ఫీచర్‌లో మార్పులు చేశారు. బ్లూటిక్ సేవలకు నెలకు 8 డాలర్ల ఫీజు ప్రకటించి, ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా ఇచ్చేశారు. దీంతో నకిలీ ఖాతాలు భారీగా పుట్టుకొచ్చాయి. కొన్ని సంస్థలకు నకిలీ ఖాతాల వల్ల కోట్లాది రూపాయల నష్టం కూడా వాటిల్లింది. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డబ్బులు కడితే బ్లూటిక్ కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు కొద్ది మార్పులు చేసి ఆ సేవలు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇవీ చదవండి : ఆసియా కుబేరుల జాబితాలో బ్రిటన్ ప్రధాని సునాక్, అక్షత.. తొలిసారిగా..
భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన