కొత్త వాహనాన్ని కొనడం చాలామందికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాహనం రోడ్డు మీదకు వచ్చే ముందే దానికి తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది. ఇందులో ప్రధానంగా వాహన బీమాను చెప్పుకోవాలి. ద్విచక్ర వాహనానికి అయిదేళ్ల థర్డ్ పార్టీ, కార్లకు మూడేళ్ల థర్డ్ పార్టీ తప్పనిసరి. ఈ వాహన పాలసీలను తీసుకునేటప్పుడే చాలామంది కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పాలసీని కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.
వాహనానికి బీమా లేకుండా నడిపినప్పుడు జరిమానా విధిస్తారు. ఏదైనా జరగరానిది జరిగితే నష్టపరిహారాన్ని యజమానే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, ఎట్టిపరిస్థితుల్లోనూ కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ అయినా లేని వాహనాన్ని రోడ్డుపై నడపకూడదు. కొత్త కారు కొన్నప్పుడు ఏడాది పూర్తిస్థాయి బీమా, మూడేళ్ల థర్డ్ పార్టీ బీమా తీసుకోవాలి. వాహనానికి ఏదైనా నష్టం వాటిల్లితే పూర్తిస్థాయి బీమా ద్వారా మరమ్మతు ఖర్చు చెల్లిస్తుంది. తృతీయ పక్షానికి నష్టం వాటిల్లినప్పుడు థర్డ్ పార్టీ బీమా పరిహారాన్ని ఇస్తుంది.
కారు/ద్విచక్రవాహనం డీలర్లు.. తమతో ఒప్పందం ఉన్న బీమా సంస్థల నుంచి పాలసీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. మనం వారు చెప్పిన పాలసీ తీసుకోవాలనే నిబంధనేమీ లేదు. ఆన్‌లైన్‌లో సరైన మీకు సరిపోయే పాలసీ గురించి వాకబు చేయండి. అందులో నుంచి మీకు నచ్చిన సంస్థ నుంచి నేరుగా పాలసీని తీసుకోవచ్చు.
ద్విచక్ర వాహనదారులు చాలామంది కేవలం థర్డ్ పార్టీ బీమా పాలసీ తీసుకొని, పూర్తి స్థాయి పాలసీని విస్మరిస్తుంటారు. ఇది పొరపాటే. ప్రమాదం లేదా దొంగతనం లాంటివి జరిగినప్పుడు పూర్తి స్థాయి బీమా పరిహారాన్ని ఇస్తుంది. ఇది లేకపోతే నష్టపోయినట్లే. చాలామంది పూర్తిస్థాయి బీమా పాలసీ వ్యవధి తీరిన తర్వాత పునరుద్ధరణ గురించి పెద్దగా పట్టించుకోరు. థర్డ్ పార్టీ బీమా ఉంది కదా అనుకుంటారు. ఇదీ మంచిది కాదు. కారుకు చిన్న నష్టం జరిగినా.. రిపేరు కోసం వేల రూపాయలు అవుతాయి. పాలసీ ఉన్నప్పుడు మన జేబుపై ఆర్థిక భారం ఉండదు అన్న సంగతి గుర్తించాలి.
వాహనానికి ఎంత విలువ కడుతున్నారన్నదీ కీలకమే. చాలా సందర్భాల్లో వాహన బీమా ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు ఇన్సూర్డ్ డిక్లేర్ వ్యాల్యూ (ఐడీవీ)ని తగ్గించి చూపిస్తారు. వాహనానికి నష్టం వాటిల్లినప్పుడు గరిష్ఠంగా చెల్లించే పరిహారం విలువ ఇది. దీన్ని తగ్గిస్తే.. ప్రీమియం భారం కాస్త తగ్గొచ్చు. కానీ, నష్టం మాత్రం పూర్తిగా భర్తీ కాదు. కాబట్టి, ఐడీవీ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.
అనుబంధ పాలసీలు జోడించుకోవడం కొన్నిసార్లు మంచిదే. కొత్తకారుకు వీటివల్ల కొంత అదనపు భద్రత లభిస్తుంది. కానీ, ఇప్పుడు అనవసరంగా కొన్ని అనుబంధ పాలసీలను అంటగడుతున్నారు. మీకు నిజంగా ఉపయోగపడే యాడ్-ఆన్‌లను మాత్రమే ఎంచుకోండి. ముఖ్యంగా జీరో డిప్రిషియేషన్ లాంటివి ఎంచుకోవచ్చు. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్టర్‌లాంటివి పరిశీలించవచ్చు.
తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను ఎంచుకోవడమూ అన్ని వేళలా మంచిది కాదు. బీమా సంస్థ ఇస్తున్న సేవలనూ పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న వాహనాన్ని విక్రయించి, దాని స్థానంలో కొత్తది కొన్నప్పుడు నో క్లెయిం బోనస్‌లాంటివి ఏమైనా వర్తిస్తాయా చూసుకోండి. అప్పుడు మీకు బీమా ప్రీమియంలో కొంత రాయితీ వచ్చే అవకాశం ఉంది.