Stock Market Closing Today : దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1021 పాయింట్లు నష్టపోయి.. 58,099కు పతనమైంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 302 పాయింట్లు తగ్గి 17,327కు దిగజారింది. ఫలితంగా.. రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఇతర ఆసియా మార్కెట్లూ ఇదే తరహాలో నష్టాలు చవిచూశాయి.
ద్రవ్యోల్బణం పెరుగుదల, మాంద్యం భయాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి పరిణామాల మధ్య అమెరికన్ డాలర్ క్రమంగా బలపడుతోంది. ఇతర కరెన్సీలన్నీ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా.. మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. అమెరికన్ విపణుల్లో పెట్టుబడులే మేలనే అభిప్రాయంతో ఉన్నారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
శుక్రవారం ఉదయం 59,005 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. మొదట్లో స్వల్పంగా పెరిగి 59,143 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. తర్వాత కాసేపటికే నష్టాల బాట పట్టింది. ఓ దశలో 57,982 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. చివరకు 58,099 వద్ద స్థిరపడింది. ఉదయం 17,594 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. 17,642 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,291 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.
'ఆల్ టైమ్ లో'కు రూపాయి
రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలరుతో పోల్చితే శుక్రవారం 25 పైసలు తగ్గి 81.04కు చేరింది. రూపాయి విలువ ఈ స్థాయికి దిగజారడం చరిత్రలో ఇదే తొలిసారి. రూపాయి విలువ పతనానికి కారణాలు, ఈ క్షీణత వల్ల సామాన్యులకు జరిగే నష్టం గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: అధిక వడ్డీ ఆశతో వాటిలో డిపాజిట్ చేస్తే ఇబ్బందే!