Stock Market Close Today : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లు తీవ్రంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం.. దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 676 పాయింట్లు కోల్పోయి 65,782 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోయి 19,526 వద్ద స్థిరపడింది
- లాభాలు పొందిన ఈక్విటీ షేర్లు : నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా
- నష్టపోయిన స్టాక్స్ : టాటాస్టీల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్
ముఖ్యంగా సెన్సెక్స్ ప్యాక్‌లో టాటా స్టీల్ 3.45 శాతం, టాటా మోటార్స్ 3.19 శాతం మేరకు నష్టపోయాయి.
యూఎస్ క్రెడిట్ రేటింగ్ తగ్గింపు
US Credit Rating Downgrade : అమెరికా అప్పులు గత రెండు దశాబ్దాల కాలంలో గణనీయంగా పెరిగాయి. అలాగే పరిపాలనా ప్రమాణాలు కూడా స్థిరంగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Fitch Ratings యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. ఫలితంగా మంగళవారం AAA నుంచి AA+కు యూఎస్ క్రిడెట్ తగ్గింది. ఇది మార్కెట్లపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించింది.
ఆసియా మార్కెట్లు
Asian stock market news : ఆసియా మార్కెట్లు సియోల్, టోక్యో, షాంగై, హాంగ్‌కాంగ్ కూడా ఇవాళ నష్టాలతో ముగిశాయి.. వీటి ప్రభావం కూడా భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ఫలితంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో సహా పలు రంగాల స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
విదేశీ పెట్టుబడులు తరలివెళ్లాయి!
Foreign fund outflows : యూఎస్ బాండ్స్ వడ్డీ రేట్లు పెరిగిన నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు ఒక్కసారిగా తరలివెళ్లాయి. ఇది కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది.
పెరిగిన చమురు ధరలు
Brent Crude Oil Prices : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 85.59 డాలర్లుగా ఉంది.