స్టాక్‌మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి కొత్త 'మార్జిన్' నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలపై స్పష్టత లేక, ముందుగా సన్నద్ధం కాని మదుపరులు షేర్ల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మదుపరుల ట్రేడింగ్ ఖాతాల్లో అప్పటికే సొమ్ము నిల్వ లేకపోయినా, తమ డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు తనఖా నిమిత్తం బదిలీ చేసి, మార్జిన్ తీసుకుని ఉండకపోయినా.. కొత్తగా షేర్లు కొనలేని పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పటికప్పుడు కొంత మంది తమ బ్యాంకు ఖాతాల నుంచి బ్రోకింగ్ సంస్థల వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలకు నగదు బదిలీ చేసి, ఆ విషయాన్ని నిర్థారించుకున్నాకే, షేర్లు కొనుగోలు చేసే వీలు కలిగింది.
అదే విధంగా షేర్ల విక్రయానికి కూడా కొంత మార్జిన్ చెల్లించాల్సి ఉన్నందున, మార్జిన్ లేని మదుపరులు తమ ఖాతాల్లోని షేర్లు విక్రయించలేకపోయారు. దీంతో షేర్ల క్రయవిక్రయాలు మందకొడిగా సాగినట్లు స్థానిక బ్రోకింగ్ వర్గాలు వివరించాయి. ఈ కొత్త నిబంధనలపై పూర్తిగా అవగాహన లేకపోవటం, దీనికి బ్రోకింగ్ సంస్థలు, మదుపరులు ఇంకా పూర్తిగా సిద్ధం కాకపోవటంతో ఈ పరిస్థితి ఉత్పన్నం అయినట్లు ఆ వర్గాలు వివరించాయి. ట్రేడింగ్ ఖాతాల్లో తగినంత సొమ్ము నిల్వ పెట్టకుండా లేదా ముందుగానే షేర్లు బదిలీ చేసి తగిన మార్జిన్ తీసుకోకుండా తమ ట్రేడింగ్ ఖాతాల్లో షేర్ల క్రయవిక్రయాలు చేపట్టిన మదుపరులకు, వాటిని అనుమతించిన బ్రోకింగ్ సంస్థలకు స్టాక్ ఎక్స్ఛేంజీలు భారీగా జరిమానా విధిస్తున్నాయి.
ఇప్పటివరకు స్టాక్‌బ్రోకర్ వద్ద ఉన్న మన ఖాతాల్లో నగదుంటే, షేర్లు కొనే వీలుండగా.. ఇకపై అక్కడకు నగదు బదిలీ చేయనవసరం లేదు. తాజా మార్పు వల్ల, ట్రేడింగ్ ఖాతాకు అనుసంధానమైన మన బ్యాంక్ ఖాతాలో నగదు ఉంటే సరిపోతుంది.
చిన్న మదుపర్లకు కష్టమే..
తాజాగా అమల్లోకి వచ్చిన మార్పులతో చిన్న మదుపరులకు నష్టమని, ప్రస్తుతం మాదిరిగా తక్కువ సొమ్ముతో షేర్ల క్రయవిక్రయాలు నిర్వహించడం ఇకపై వీలుకాదని స్థానిక స్టాక్‌బ్రోకింగ్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. చిన్న, మధ్యస్థాయి బ్రోకింగ్ సంస్థల వద్ద ట్రేడింగ్ పరిమాణం తగ్గిపోయి, ఆ మేరకు బ్రోకింగ్ సంస్థలకు నష్టం జరుగుతుందని వివరించారు. 'మార్జిన్' కోసం మదుపరులు ఎక్స్ఛేంజీ వద్ద తనఖా పెట్టిన షేర్లను విక్రయించాలంటే ముందుగా వాటిని తనఖా నుంచి వెనక్కి తెచ్చుకోవాలని, ఆ తర్వాతే వాటిని విక్రయించడానికి వీలుకలుగుతుందని అన్నారు. దీనికి కనీసం ఒక రోజు సమయం పడుతుందని, ఈ లోపు షేరు ధర పడిపోతే ఇన్వెస్టర్ నష్టపోతాడని తెలిపారు.
దీర్ఘకాలిక పెట్టుబడులకు మేలు..
తాజా మార్పుల వల్ల స్టాక్‌మార్కెట్లో 'స్పెక్యులేషన్' తగ్గుతుందని, షేర్ల ధరల్లో అధిక వ్యత్యాసాలు కనిపించవని, దీనివల్ల 'స్వింగ్ ట్రేడర్లకు' అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మేలు జరుగుతుందని, బ్రోకింగ్ సంస్థల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలు కలుగుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నూతన నిబంధనలతో స్టాక్ మార్కెట్ వ్యవహారాలపై ఎక్స్ఛేంజీలకు పూర్తి పట్టు లభిస్తుందని, అదే సమయంలో బ్రోకింగ్ సంస్థల పాత్ర తగ్గుతుందని వివరిస్తున్నాయి.
ఈరోజు అమ్మిన షేర్ల విలువతో వెంటనే కొనలేం..
ప్రస్తుతం షేర్ల ట్రేడింగ్‌కు టీ+1 సెటిల్‌మెంట్ అమలవుతోంది. అంటే ఈరోజు అమ్మిన షేర్లకు సంబంధించిన మొత్తం, మరుసటిరోజు మన ఖాతాలో జమవుతుంది. ఇప్పటివరకు మనం ఒక కంపెనీ షేర్లు అమ్మితే, ఆ విలువకు సరిపడా మరో కంపెనీ షేర్లు వెంటనే కొనేందుకు బ్రోకర్లు అనుమతిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఇది కూడా వీలవ్వడం లేదు. మన షేర్లు విక్రయించినా, ఆ నగదు జమయ్యాకే కొత్త షేర్లు కొనాలి. లేదా అదనపు నగదు వినియోగించుకోవాల్సిందే.