September 30 Deadline for These Financial Tasks Know Full Details in Telugu : మనం ప్రస్తుతం సెప్టెంబర్ నెల మధ్యలో ఉన్నాం. మరో రెండు వారాల్లో ఈనెల ముగియనుంది. అయితే.. ఈ క్రమంలో మీరు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ మదుపర్లు నామినీని ఎంచుకోవడానికి ఈనెలతోనే గడువు ముగియనుంది. అలాగే.. కొన్ని బ్యాంకులు తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో మదుపు చేసేందుకూ చివరి నెల సెప్టెంబరే. ఇంకా.. మరికొన్ని ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా సెప్టెంబర్ 30వ తేదీయే (Financial Deadlines in September) ఆఖరి గడువుగా ఉంది. ఈ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే ఆర్థికంగా మీరే నష్టపోతారు. మరి, అవేంటి అన్నది ఈ స్టోరీలో చూద్దాం..!
చిన్న పొదుపు పథకాలకు ఆధార్ అనుసంధానం(Small Saving Schemes Aadhaar Link) : మీరు ముందుగా పూర్తి చేయాల్సిన విషయం ఆధార్ కార్డుకు సంబంధించినది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(SCSS), ఇతర పోస్టాఫీసు సేవింగ్స్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టినవారు సెప్టెంబర్ 30లోపు ఆధార్ వివరాలు తప్పక అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సకాలంలో సమర్పించకపోతే.. అక్టోబర్ 1 నుంచి సదరు కస్టమర్ల అకౌంట్లు తాత్కాలికంగా నిలిపివేయబడతాయనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.
ప్రత్యేక ఎఫ్‌డీల్లో మదుపు(Fixed Deposits).. ఆర్‌బీఐ మే 2022 నుంచి రెపోరేటు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా ఫిక్స్ డిపాజిట్ వడ్డీరేట్లను అందుకు అనుగుణంగా సవరించాయి. కొన్ని బ్యాంకులు ఈ క్రమంలో అధిక వడ్డీరేట్లతో ప్రత్యేక డిపాజిట్ పథకాలనూ తీసుకొచ్చాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ వీ కేర్(SBI WeCare) స్కీమ్ అందిస్తోంది. సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఈ స్కీమ్ కింద సాధారణ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు.. అంటే మొత్తం 100 బేసిస్ పాయింట్ల వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది. ఈ పథకం కింద బ్యాంక్ 7.50 శాతం వడ్డీ తన ఖాతాదారులకు ఆఫర్ చేస్తోంది. అయితే.. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.
నామినీని ఎంచుకున్నారా?(Nomination Deadline for Demat Accounts) : 2022 అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత ఫోలియో జనరేట్ అయిన కొత్త మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు నామినీ ఎంచుకోవడమో లేదా వద్దనుకుంటున్నట్లో ధ్రువీకరించాలి. అంతకంటే ముందు నుంచి ఫండ్లలో మదుపు చేస్తున్నవారు కూడా.. నామినీని ఎంచుకోవడం గానీ లేదా వద్దనుకుంటున్నామని గానీ ధ్రువీకరణ సమర్పించాలి. దీనికి కూడా సెప్టెంబరు 30 తుది గడువుగా ఉంది. ధ్రువీకరణ సమర్పించనివారి ఖాతాల్లో నిర్వహణ నిలిచిపోతుంది. స్టాక్ మార్కెట్ మదుపర్లకు కూడా ఇది వర్తిస్తుంది. లేదంటే మీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు నిలిచిపోతాయి.
ఇండియా పోస్ట్‌లో ఆధార్ ఇచ్చారా? : ఇండియా పోస్ట్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని మే నెలలో తమ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు వివరాలు ఇవ్వనివారు సెప్టెంబరు 30 కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే పాన్ కార్డు వివరాల సమర్పణకు కొన్ని నిబంధనలు విధించింది. అకౌంట్లో ఉన్న డిపాజిట్ మొత్తం రూ.50 వేలు దాటినా.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల మొత్తం విలువ రూ.1 లక్ష మించినా.. ఒక నెలలో బదిలీ లేదా ఉపసంహరణ మొత్తం రూ.10 వేలు దాటినా.. ఈ మూడు సందర్భాల్లో మీరు రెండు నెలల్లోగా పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.
మీ దగ్గర ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకున్నారా?(Last Date to Return Rs 2000 notes) : ఆర్‌బీఐ మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చలామణిలో ఉన్న నోట్లను మార్చుకోవడం లేదా ఖాతాలో డిపాజిట్ చేసేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. సెప్టెంబరు 30తో ఈ గడువు కూడా ముగియనుంది.