Credit Score Tips : స్వయం ఉపాధి పొందేవారు.. మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడం ఎలా? - సిబిల్ స్కోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ 2023
Credit Score Improvement Tips : మీరు స్వయం ఉపాధి పొందుతూ ఉంటారా? మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగస్తులే కాదు.. స్వయం ఉపాధి పొందేవారు కూడా మంచి క్రెడిట్ స్కోర్ సంపాదించగలరు. అది ఎలాగో.. దాని కోసం పాటించాల్సిన టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
![Credit Score Tips : స్వయం ఉపాధి పొందేవారు.. మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవడం ఎలా? Credit Score Improvement tips](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-07-2023/1200-675-18961881-thumbnail-16x9-credit-card.jpg?imwidth=3840)
Credit Score Tips and Tricks : నేటి కాలంలో మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి క్రెడిట్ స్కోర్‌ను బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఉద్యోగస్తులు ప్రతి నెలా జీతం వస్తుంది కనుక మంచి క్రెడిట్ స్కోర్‌ను సాధించగలరు. అలాగే దానిని దీర్ఘకాలంపాటు నిర్వహించుకోగలరు కూడా. కానీ స్వయం ఉపాధి పొందేవారు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు.
Credit score tips for self employed : వాస్తవానికి మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఇతరులతో పోలిస్తే, తక్కువ వడ్డీకే వ్యక్తిగత, గృహ రుణాలను అందిస్తాయి. అలాగే ఆకర్షణీయమైన ఆఫర్లతో క్రెడిట్ కార్డులను కూడా ఇస్తాయి. సాధారణంగా ఉద్యోగులు మంచి క్రెడిట్ స్కోర్ మెయింటేన్ చేస్తూ, ఈ బెనిఫిట్స్ అన్నీ చాలా సులువుగా పొందగలుగుతారు. అయితే స్వయం ఉపాధి పొందేవారు కూడా.. మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకుని ఈ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు. అందుకే ఇప్పుడు మనం స్వయం ఉపాధి పొందేవారు మంచి క్రెడిట్ స్కోర్ సాధించడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం.
ఫైనాన్షియల్ రికార్డులను నిర్వహించాలి :
How to maintain financial records : స్వయం ఉపాధి పొందేవారు కచ్చితంగా తమ ఆర్థిక లావాదేవీలను రికార్డు చేసుకుని ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, వ్యయాలు, టాక్స్ ఫైలింగ్స్, ఇన్వాయిస్లు అన్నీ సక్రమంగా రికార్డు చేసుకోవాలి. ఎందుకంటే, లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. బ్యాంకులు లేదా రుణాలు మంజూరు చేసే సంస్థలు వీటిని తప్పకుండా పరిశీలిస్తాయి.
వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలు వేర్వేరుగా నిర్వహించాలి :
మీరు కచ్చితంగా మీ వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలను వేర్వేరుగా నిర్వహించడం మంచిది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేసుకోండి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది.
బిజినెస్‌ను రిజిస్టర్ చేసుకోవాలి :
Business registration : మీరు కచ్చితంగా చట్టబద్ధంగా మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. మీరు సొంతంగా బిజినెస్ ప్రారంభించినా, లేదా భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తున్నా, లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాదారుగా ఉన్నా కూడా కచ్చితంగా దానిని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల బ్యాంకులకు మీ క్రెడిబిలిటీ తెలుస్తుంది.
సకాలంలో వాయిదాలు చెల్లించాలి :
మీరు తీసుకున్న లోన్ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఇలా చేస్తే కచ్చితంగా మంచి క్రెడిట్ హిస్టరీ నమోదు అవుతుంది. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరిగి, తరువాతి కాలంలో త్వరగా, తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే అవకాశం వస్తుంది.
క్రెడిట్ రిపోర్టును సరిచూసుకోవాలి :
Credit score check for free : క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్‌గా రివ్యూ చేయడం చాలా మంచిది. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌లో ఏమైనా తప్పులు ఉన్నా, లేదా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా దానిని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Credit bureaus in India : భారతదేశంలో సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ లాంటి క్రెడిట్ బ్యూరోలు.. క్రెడిట్ స్కోర్‌ను అందిస్తాయి. సెబీ నిబంధనల మేరకు ఇవి సంవత్సరానికి ఒక సారి పూర్తి ఉచితంగా బేసిక్ క్రెడిట్ రిపోర్టును అందిస్తాయి. వీటితో పాటు బ్యాంక్‌బజార్.కామ్ లాంటి వెబ్సైట్లలో కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను చూసుకోవచ్చు.
క్రెడిట్ కార్డును పరిమితికి లోబడి వినియోగించాలి :
Low Credit Utilization Ratio : సాధారణంగా చాలా మంది క్రెడిట్ కార్డు పరిమితి ఉన్నంత వరకు వాడేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. కచ్చితంగా క్రెడిట్ కార్డు లిమిట్లో కేవలం 30 శాతం వరకు మాత్రమే ఉపయోగించాలి. అంటే 'లో క్రెడిట్ కార్డ్ యుటిలైజేన్ రేషియో' (సీయూఆర్)ను మెయింటేన్ చేస్తూ ఉండాలి.
ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1,00,000 అయితే, మీరు కేవలం రూ.30,000 మాత్రమే ఉపయోగించుకోవాలి. దానిని కూడా సకాలంలో బ్యాంకులకు చెల్లించాలి. ఇలా చేస్తే కచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది.
వైవిధ్యంగా ఉండాలి!
Portfolio diversification : మీ క్రెడిట్ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ లోన్స్, అన్ సెక్యూర్డ్ లోన్స్, క్రెడిట్ కార్డు బిల్లులను వేర్వేరుగా నిర్వహిస్తూ ఉండాలి. వాటి వాయిదాలను సకాలంలో చెల్లించాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి దుష్ప్రభావం పడదు.
రుణదాతలతో సంబంధాలు కొనసాగించాలి :
స్వయం ఉపాధి పొందేవారు.. రుణదాతలతో మంచి సంబంధాన్ని పెంచుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల మనకు అనుకూలమైన నిబంధనలతో, తక్కువ వడ్డీతో, సులువుగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
తరచుగా రుణాల కోసం దరఖాస్తు చేయకూడదు :
రుణాల కోసం దరఖాస్తు చేసిన వెంటనే, బ్యాంకులు అధికారికంగా మీ క్రెడిట్ స్కోర్‌పై ఎంక్వైరీ చేస్తాయి. మీరు తరచుగా రుణాల కోసం దరఖాస్తులు చేస్తూ ఉంటే, బ్యాంకులు చేసే ఎంక్వైరీలు కూడా పెరిగిపోతాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా దెబ్బతీస్తుంది. అందువల్ల కచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేయాలి.
నిపుణుల సలహాలు తీసుకోవాలి :
Financial expert advice : స్వయం ఉపాధి పొందేవారు ఆర్థిక క్రమశిక్షణ కోసం, ఆర్థిక అంశాల నిర్వహణ కోసం వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం. దీని వల్ల మీ ఫైనాన్షియల్ జర్నీ బాగుంటుంది. మీ క్రెడిట్ స్కోర్ కూడా వృద్ధి చెందుతుంది.