Rupee Value Decreased:పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా అవుతోంది సామాన్యుల స్థితి. ముడి చమురు ధరల కారణంగా ఇప్పటికే వస్తువుల ధరలు భగ్గుమంటుంటే.. రూపాయి మారకపు విలువ క్షీణత వల్ల రోజువారీ ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచీ బలహీనంగానే ఉన్న రూపాయి సోమవారం డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠ స్థాయి అయిన 77.52కు చేరినా, చివరకు 77.44 వద్ద ముగిసింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే డాలర్ విలువ రూ.80కి చేరుతుందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
కూరగాయలు, నెలవారీ కిస్తీలు భారమవుతాయ్.. రూపాయి బలహీనపడితే.. మనం దిగుమతి చేసుకునే వస్తువులకు మరింత అధికమొత్తం చెల్లించాల్సి వస్తుంది. దేశీయ ముడి చమురు అవసరాలను 80 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఇప్పటికే ముడి చమురు ధరల కనుగుణంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు, మరికొన్ని ఉత్పత్తుల ధరలు అధికమయ్యాయి. ఇప్పుడు రూపాయి విలువ క్షీణత వల్ల పెట్రో ధరలు మరింత పెరిగి, సామాన్యుడి జేబుపై ప్రభావం పడుతుంది. రవాణా వ్యయాలు భారమై.. కూరగాయలు, ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. ద్రవ్యోల్బణం వల్ల రుణ రేట్లూ పెరుగుతాయి. (ఆర్‌బీఐ ఇప్పటికే కీలక రేట్లు పెంచింది.. ఇంకా పెంచొచ్చు.) ఫలితంగా నెలవారీ కిస్తీ (ఈఎమ్‌ఐ)లు భారమవుతాయి. ప్రధానంగా సామాన్యులు, మధ్యతరగతికి ఇది తీవ్ర ఇబ్బందికరం.
సబ్బులు, సెల్ ఫోన్లు, కార్లు ప్రియం.. తయారీలో ముడి చమురును వినియోగించుకునే సబ్బులు, కాస్మొటిక్స్ వంటి ఉత్పత్తులపై పడే భారాన్ని కంపెనీలు వినియోగదారులకు మళ్లిస్తాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తులు ఖరీదవుతాయి. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, డిజిటల్ కెమేరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వాడే సర్క్యూట్ బోర్డులు దిగుమతి చేసుకుంటున్నందున, ఇవీ ఖరీదవుతాయి... డాలర్లలో దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఫలితంగా సామాన్యుడి రోజువారీ ఖర్చులు పెరగడం ఖాయం. దిగుమతి చేసుకునే విలాసవంత కార్లు, బైక్‌లతో పాటు కార్ల విడిభాగాలు ప్రియం కావొచ్చు.
ఒక వేళ మీ పిల్లలు విద్యా రుణం తీసుకుని విదేశాల్లో చదువుతూ ఉంటే, అదీ భారమవుతుంది. 2017లో డాలర్ మారకపు విలువ రూ.65, 2019లో రూ.71 కాగా ఇపుడు రూ.77.50 దరిదాపులకు చేరడం వల్ల.. రూపాయల్లో చెల్లించే నెలవారీ వాయిదా మొత్తం పెరుగుతుంది.
విదేశీ ప్రయాణాలపైనా.. కొవిడ్ భయాలు తగ్గడంతో చాలా మంది విదేశీ ప్రయాణాలు పెట్టుకున్నారు. డాలర్ విలువ రూ.70గా ఉన్నప్పుడు, 10,000 డాలర్ల విదేశీయానం ఖర్చు రూ.7 లక్షలు అయితే.. ప్రస్తుత మారకపు విలువ వద్ద అది రూ.7.75 లక్షలకు చేరుతుంది. అంటే డాలర్ల కోసం రూపాయల్లో అదనంగా చెల్లించాలి.
సానుకూలతలూ ఉన్నాయ్.. ఇప్పటికే మీ పిల్లలు/ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తూ, అక్కడి నుంచి ఇక్కడకు డాలర్లలో డబ్బు పంపుతుంటే, ఆ మొత్తం విలువ రూపాయల్లో మరింత పెరుగుతుంది. డాలర్లు తక్కువగా ఉన్నా, రూపాయల్లో ఎక్కువమొత్తం చేతికి అందుతుంది. ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఔషధాలకు మార్జిన్లు పెరుగుతాయి కాబట్టి ఆయా షేర్లలో పెట్టుబడులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుంది.. రిజర్వ్ బ్యాంక్ వద్ద 600 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి. రూపాయి విలువను రక్షించడానికి ఫారెక్స్ మార్కెట్లలో ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే భారత మార్కెట్ల నుంచి విదేశీ ఫండ్‌లు 17.7 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నాయి. రూపాయి మారకపు విలువ క్షీణత తాత్కాలికమేనని, ఐపీఓ సంబంధిత నిధుల వల్ల మార్కెట్లు నిలబడి.. రూపాయికి మద్దతునిస్తాయని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. డాలర్ రూ.80 స్థాయికి చేరే అవకాశమూ లేకపోలేదని మార్కెట్ నిపుణులు కొంతమంది పేర్కొంటున్నారు.
బిట్‌కాయిన్ మదుపర్ల బెంబేలు: 2021 జులైలో ఏ కనిష్ఠ స్థాయి నుంచి బిట్‌కాయిన్ విలువ పెరగడం ప్రారంభమైందో.. మళ్లీ పది నెలలు తిరిగేసరికి ఆ స్థాయి చేరువకు వచ్చేసింది. ఆరు నెలల క్రితం 68,000 డాలర్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకిన ఈ క్రిప్టో కరెన్సీ విలువ.. ఇప్పుడు సగానికి పైగా కోల్పోయింది. ఏడాది కాలంలో బిట్‌కాయిన్ విలువ ఎంతలా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైందో ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాయిన్‌మార్కెట్‌క్యాప్ గణాంకాల ప్రకారం.. బిట్‌కాయిన్ విలువ గత వారం రోజుల వ్యవధిలో 15 శాతం క్షీణించింది. 'ద్రవ్యోల్బణంపై ఆందోళనల నేపథ్యంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వృద్ధి స్తబ్దుగా ఉండొచ్చన్న అంచనాలు, మరికొన్ని దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభాల కారణంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం' బిట్‌కాయిన్ విలువ క్షీణతకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, భారత్ కేంద్ర బ్యాంకులు గతవారం కీలక రేట్లను పెంచాయి. ఈ పరిణామాలు బిట్‌కాయిన్ సహా క్రిప్టో మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల ధోరణి మున్ముందూ ఇలాగే కొనసాగితే బిట్‌కాయిన్ 30,000 డాలర్ల స్థాయిని పరీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బిట్‌కాయిన్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ.. మదుపర్ల నుంచి దీనికి ఆదరణ తగ్గడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి: ఎల్‌ఐసీ ఐపీఓకు 3 రెట్ల స్పందన.. ఎవరు అధిక బిడ్లు వేశారంటే?