Reliance Q1 results: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 46 శాతం ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.12,273 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.17,955 కోట్లు ఆర్జించింది. కంపెనీ ఆదాయం సైతం 54.54 శాతం మేర వృద్ధి చెందింది. గతేడాది కంపెనీ ఆదాయం ఇదే త్రైమాసికంలో రూ.1,44,372 కోట్లు ఆర్జించగా.. ఈ ఏడాది ఆ మొత్తం రూ.2,23,113 కోట్లకు చేరింది. ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఆయిల్ 2 కెమికల్ వ్యాపారం ద్వారా అధిక ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది.
అదరగొట్టిన జియో..: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సైతం తొలి త్రైమాసికంలో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన నికర లాభంలో 23.8 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.3,501 కోట్లు కాగా.. ఈ ఏడాది కంపెనీ రూ.4,335 కోట్లు ఆర్జించింది. అంతకుముందు నాటి త్రైమాసికంతో పోలిస్తే 3.9 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. కంపెనీ ఆదాయం సైతం గతేడాదితో పోల్చినప్పుడు 21.6 శాతం వృద్ధి కనబరిచింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.17,994 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.21,873 కోట్లుగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం పెరగడం, సబ్‌స్క్రైబర్ల సంఖ్య వృద్ధి చెందడం కంపెనీ మెరుగైన ఫలితాలను ప్రకటించడానికి దోహదపడ్డాయి. మరోవైపు జులై 26న జరిగే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి జియో సిద్ధమైంది. ఎర్నెస్ట్ మనీ కింద రూ.14వేల కోట్లను కంపెనీ ఇప్పటికే డిపాజిట్ చేసింది.
ఇవీ చదవండి: ఐటీ రిటర్న్స్ దాఖలుకు జులై 31 ఆఖరు.. ఇలా చేస్తున్నారా మరి?