ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అత్యంత పెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ప్రసార మాధ్యమాల్లోనూ ఎక్కువగా కనిపించే కంపెనీల్లో అగ్రస్థానంలో ఉందని 2022 విజికీ న్యూస్‌మేకర్స్ వెలువరచిన నివేదిక వెల్లడించింది. ఆయా బ్రాండ్లు, వ్యక్తుల గురించి మీడియాలో వచ్చే వార్తల పరిమాణం, శీర్షికల ప్రాధాన్యం, పబ్లికేషన్ల పాఠకుల సంఖ్యను బేరీజు వేసుకుని లెక్కగట్టిన ‘విజికీస్ న్యూస్ స్కోర్’ ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్లు తెలిపింది. కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ సాంకేతికత ఆధారంగా 4 లక్షలకు పైగా ఆన్‌లైన్ పబ్లికేషన్లలో వెయ్యికి పైగా భారత కంపెనీలపై ప్రచురితమైన 5 కోట్ల వార్తలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించింది.
తొలి 10 స్థానాల్లో
- ఈ జాబితా తొలి 10 స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఒన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం), ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ ఉన్నాయి.
- ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(11), జొమాటో(12), విప్రో(13), యాక్సిస్ బ్యాంక్(14), ఎన్‌టీపీసీ(15), టాటా స్టీల్(16), ఐటీసీ(17), ఎల్ అండ్ టీ(18) ఉన్నాయి.
- 2022లో రిలయన్స్ 92.56 న్యూస్ స్కోరును సాధించి, వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానాన్ని పొందింది. 90 స్థాయిని అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. మాండరిన్ ఓరియంటల్, యాడ్‌వర్బ్ టెక్నాలజీస్, కంపా కోలా తదితర బ్రాండ్ల కొనుగోళ్లను చేపట్టడంతో పాటు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించడంతో ఇది సాధ్యమైంది.2021లో ఈ కంపెనీ స్కోరు 84.9. జియో, ముంబయి ఇండియన్స్, నెట్‌వర్క్18, మనీకంట్రోల్, హామ్లేస్ వంటి గ్రూప్‌నకు చెందిన ఇతర బ్రాండ్లను మినహాయించాకే, స్కోరును లెక్కవేసినట్లు సంస్థ తెలిపింది.
- ఎస్‌బీఐ విషయానికొస్తే.. వివిధ భాగస్వామ్యాలు, అవగాహన ఒప్పందాలపై సంతకాల నుంచి రుణాల రద్దు, మౌలిక బాండ్ల ద్వారా రూ.10,000 కోట్ల సమీకరణ ద్వారా రెండో స్థానంలో నిలిచింది.
- గిఫ్ట్ సిటీ క్లియరింగ్ కార్ప్, వర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో వాటాలను కొనుగోలు చేయడం నుంచి ఈఎస్‌ఓఎస్ కింద లక్షల షేర్ల కేటాయింపు, లాభాల పెరుగుదల వంటి వాటి వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
- దేశంలో 10 లక్షల మంది వినియోగదార్లకు 5జీ సేవలు అందించడం, వివిధ ఫీచర్లు, ప్లాన్లు, ఉత్పత్తులతో ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లు సందడి చేయడంతో భారతీ ఎయిర్‌టెల్ నాలుగో స్థానంలో నిలిచింది.
- ఏడాది కిందట స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైన ఒన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృసంస్థ).. షేరు ధర పతనం, షేర్ల తిరిగి కొనుగోలు వార్తలు, రైలు టికెట్ల బుకింగ్, నియామకాలు, ఉన్నతాధికారుల మార్పులు తదితరాల వల్ల అయిదో స్థానం దక్కించుకుంది.
- ఇవీ చదవండి:
- కొత్త ఫీచర్లతో ట్విట్టర్ బ్లూ.. ఆ యూజర్లకు సబ్స్క్రిప్షన్ ఛార్జి పెంపు
- వడ్డీ రేట్ల పెంపుతో హోంలోన్ భారం అవుతోందా? అయితే ఇలా చేయండి!