Card Tokenization: కార్డు 'టోకనైజేషన్' నిబంధనల గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మూడు నెలల పాటు అంటే సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. టోకనైజేషన్ నిబంధనలను పాటించడానికి పరిశ్రమ ఇంకా సంసిద్ధంగా లేదనే అభిప్రాయం రావడం వల్ల.. గడువును జూన్ 30 నుంచి ఆర్‌బీఐ పొడిగించింది. ప్రస్తుత కార్డు వివరాలను ప్రత్యామ్నాయ భద్రతా కోడ్‌గా పిలిచే 'టోకెన్'తో భర్తీ చేయడాన్ని 'టోకనైజేషన్'గా పిలుస్తారు. ఎవరైనా ఒక వినియోగదారుడు తన కార్డుకు సంబంధించిన టోకనైజేషన్ కోసం వచ్చే విజ్ఞప్తిని అంగీకరించే సంస్థను టోకెన్ రిక్వెస్టర్ అంటారు. ఈ టోకెన్ రిక్వెస్టర్, సంబంధిత టోకెన్ జారీ చేయడం కోసం ఆ విజ్ఞప్తిని కార్డు నెట్‌వర్క్(మాస్టర్ కార్డు, వీసా లేదా రుపే)కు పంపిస్తుందన్నమాట. ఆ తర్వాత కార్డు జారీ చేసిన బ్యాంకులకు సమాచారం అందుతుంది.
భద్రతే లక్ష్యం..
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీల్లో భద్రతను పెంచడమే టోకనైజేషన్ లక్ష్యం. టోకనైజేషన్‌తో కార్డు వివరాల నిల్వ పరిమితంగా ఉంటుంది. తాజాగా అన్ని ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వేలు, వ్యాపారులు, ఇ-కామర్స్ కంపెనీలు తమ వినియోగదార్లకు చెందిన కార్డుల టోకనైజేషన్‌ను అమలు చేయాలని ఆర్‌బీఐ కోరింది. ఇప్పటిదాకా 19.5 కోట్ల టోకెన్లు సృష్టించారని ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పెద్ద వ్యాపారులందరూ ఈ వ్యవస్థకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిసింది. కొంత మంది మాత్రం ఇంకా ఆ ప్రక్రియలో ఉన్నారు. 2020 మార్చిలో ఆర్‌బీఐ ఈ నిబంధనలను జారీ చేసింది. మర్చంట్లు తమ సర్వర్లలో వినియోగదారు కార్డు వివరాలను నిల్వ చేయకుండా, ప్రత్యామ్నాయంగా సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్) టోకనైజేషన్‌ను అందిపుచ్చుకోవాలని సూచించింది.
ఇవీ చదవండి: అమెరికా సంస్థతో డాక్టర్ రెడ్డీస్ బిగ్ డీల్