Low value stocks Risks : స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చినవారు, ట్రేడింగ్‌పై సరైన అవగాహన లేనివారు తక్కువ ధరకు వచ్చే పెన్నీ స్టాక్స్ కొనడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ షేర్లు కొనవచ్చునని.. తరువాత వీటిని భారీ లాభాలకు అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు.
పెన్నీ స్టాక్స్ విషయంలో జాగ్రత్త!
Investing in Penny stocks risks : వాస్తవానికి చాలా చిన్న కంపెనీల షేర్లు.. ఆయా సంస్థల ఆర్థిక కలాపాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా రాణిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల సమస్య రాదు. కానీ కొన్ని కంపెనీల షేర్ల విలువను ఆపరేటర్లు కృత్రిమంగా పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. మీరు కనుక ఇలాంటి షేర్లలో పెట్టుబడులు పెడితే మాత్రం భారీగా నష్టపోవడం ఖాయం. ఎలా అంటే.. కొందరు ఆపరేటర్లు తమకు నచ్చిన చిన్న కంపెనీల షేర్లను విపరీతంగా కొంటూ.. రిటైల్ మదుపర్లలో ఆశ పుట్టిస్తారు. దీనితో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆ షేర్లను కొంటారు. అప్పుడు సహజంగానే ఆ షేర్ల విలువ పెరుగుతుంది. ఇదే సమయంలో ఆపరేటర్లు తమ దగ్గర ఉన్న అన్ని షేర్లనూ భారీ లాభాలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. కానీ సాధారణ ఇన్వెస్టర్లు మాత్రం కోలుకోలేని విధంగా ఆర్థికంగా నష్టపోతారు. అందుకే ఇలాంటి మోసాలను నివారించి, మదుపరులను కాపాడడానికి దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక నిఘా వ్యవస్థను తీసుకువచ్చాయి.
ఈఎస్ఎమ్.. ప్రత్యేక నిఘా
Enhanced Surveillance Measure : బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జూన్ 5 నుంచి ఎన్హాన్స్డ్ సర్వైలెన్స్ మెజర్ (ఈఎస్ఎమ్)ను అమలులోకి తెచ్చాయి. దీని ద్వారా రూ.500 కోట్ల లోపు మార్కెట్ విలువ ఉన్న అతిచిన్న కంపెనీల షేర్ల విషయంలో ప్రత్యేక నిఘా ఆంక్షల వ్యవస్థను అమలుచేయడం ప్రారంభించాయి. దీని ప్రకారం, ఒక ట్రేడింగ్ డేలో గరిష్ఠ - కనిష్ఠ ధరలు, ఈ రోజు ముగింపు - ముందు రోజు ముగింపు ధరల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తారు. ఒక వేళ నెల వ్యవధిలో ఆయా షేర్ల విలువల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తే.. స్టాక్ ఎక్స్ఛేంజీలు వెంటనే ఆయా కంపెనీల షేర్లను నిఘా ఆంక్షల వ్యవస్థ జాబితాలోకి చేరుస్తాయి.
ఈ సరికొత్త ESM విధానం వల్ల మదుపరులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టే ముందు.. ఈ ఆంక్షల జాబితాలో ఆ కంపెనీ షేర్లు ఉన్నాయా? లేదా? చూసుకోవడం మంచిది. ఒక వేళ ఉంటే.. ఆ షేర్లకు దూరంగా ఉండడం మరీ మంచిది.
ఆంక్షల జాబితాలో ఉంటే.. షేర్లు కొనకూడదా?
ESM category stocks : వాస్తవానికి ఒక కంపెనీ షేరు ఈఎస్ఎమ్ పరిధిలో ఉన్నంత మాత్రాన.. ఆ కంపెనీపై ప్రతికూల భావన పెంచుకోవడం సరికాదు. కేవలం ఆ షేరు విలువల్లో తీవ్ర ఒడుదొడుకులను నివారించి, మదుపర్లను నష్టాల నుంచి కాపాడాలి అన్నదే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అని గ్రహించాలి.
ఈఎస్ఎమ్ పరిధిలోని షేర్ల కొనుగోలుకు ఆర్డరు పెట్టగానే.. కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌పై ఓ హెచ్చరిక వస్తుంది. దీని వల్ల ఆ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాలా? వద్దా? అని మదుపరులు నిర్ణయించుకునేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది.
వాస్తవానికి భారీ నష్టాలకు సిద్ధపడిన వారు మాత్రమే పెన్నీ స్టాక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ చిన్న స్టాక్స్‌లో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ షేర్లను అమ్మివేసి.. సొమ్ము చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
మరింత అప్రమత్తత కోసం..
స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఉదాహరణకు.. ఆదానీ గ్రూపు కంపెనీలు రెండేళ్ల సమయంలో మదుపరులకు భారీ లాభాలు ఆర్జించి పెట్టాయి. కానీ ఆదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదిక రావడం వల్ల ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఆదానీ షేర్లను గరిష్ఠ విలువల వద్ద కొనుగోలు చేసిన మదుపరులు భారీగా నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ ఆదానీ గ్రూపు షేర్ల విలువలు పెరుగుతున్నప్పటికీ.. గత గరిష్ఠ స్థాయిలకు చాలా దూరంగానే ఉన్నాయి.
బడా పెట్టుబడిదారుల వద్ద భారీగా నిధులు ఉంటాయి కనుక స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చినప్పటికీ.. వారు దీర్ఘకాలంపాటు వేచి ఉండగలుగుతారు. కానీ సామాన్య మదుపరులకు అది సాధ్యం కాదు. అందువల్ల తక్కువ ధరకే షేర్లు అమ్మేసి, ఆర్థికంగా భారీగా నష్టపోతారు. దీనిని దృష్టిలో ఉంచుకునే 'ఈఎస్ఎమ్' నిఘా వ్యవస్థను తీసుకొచ్చినట్లు సెబీ స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈఎస్ఎమ్ పరిధిలోని షేర్లకు సోమవారం మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది.
దశలవారీగా ఆంక్షలు తొలిగే అవకాశం
ESM Category Shares : అదానీ గ్రూప్ షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనైనప్పుడు.. దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆ కంపెనీ షేర్లను నిఘా ఆంక్షల వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చాయి. ఒడుదొడుకులు కాస్త తగ్గాక.. ఆదానీ గ్రూపు షేర్లను క్రమంగా ఆంక్షల పరిధి నుంచి బయటకు తీసుకువచ్చాయి. ఈఎస్ఎమ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది.
ఈఎస్ఎమ్లో చేర్చిన చిన్న కంపెనీల షేర్లు కనీసం 3 నెలలపాటు ఆంక్షల పరిధిలో ఉంటాయి. ఈ కంపెనీల షేర్లతో ట్రేడింగ్ చేయాలంటే కచ్చితంగా 100 శాతం మార్జిన్ చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలు పూర్తి అయ్యాక, నిర్దేశిత అర్హతలు సాధించిన దాని ప్రకారం, దశల వారీగా ఆ కంపెనీ షేర్లను ఆంక్షల పరిధి నుంచి తొలగిస్తారు.
ఈఎస్ఎమ్ రెండో దశలో ఏదేనీ కంపెనీ షేర్లు ఉంటే.. ఒక నెలపాటు ఆంక్షల పరిధిలో ఉంచుతారు. నెల రోజులు పూర్తయ్యాక వారంవారీ సమీక్ష నిర్వహిస్తారు. నెలలో ప్రారంభ-ముగింపు ధరల మధ్య వ్యత్యాసం 8 శాతం కంటే తక్కువగా ఉంటే.. మొదటి దశకు ఆ షేరును పంపిస్తారు. వాస్తవానికి షేర్లపై దశలవారీ సమీక్ష వారం వారీగా నిర్వహిస్తారు.
ఈ సంస్థలకు మినహాయింపు ఉంటుంది!
వాస్తవానికి రూ.500 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) విభాగంలోని కంపెనీ షేర్లకు ఈఎస్ఎమ్ నుంచి మినహాయింపు ఉంటుంది.