2023 ఏడాదికి ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 83.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గతేడాది 90.7 బిలియన్ డాలర్ల సంపదతో 10వ స్థానంలో ఉన్న అంబానీ.. ఈ ఏడాది ఓ మెట్టు పైకి ఎక్కారు.
తాజా జాబితాలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్‌కు చెందిన లారీ పేజ్- సెర్గీ బ్రిన్, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్, డెల్ టెక్నాలజీస్‌కు చెందిన మైఖేల్ డెల్ కంటే ముకేశ్ అంబానీ ఎగువ స్థానంలో ఉన్నారు. మరోవైపు భారత్‌లోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగిన గౌతమ్ అదానీ.. తన కంపెనీల షేర్ల ధరలు పతనమైన కారణంగా ఈ ఏడాది 24వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 47.2 బిలియన్ డాలర్లని అంచనా.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ సంపద విలువ 25.6 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్లోబల్ ర్యాంకుల్లో 55 స్థానంలో ఉన్న నాడార్.. ఫొర్బ్స్ జాబితాలో నమోదైన భారతీయులలో మూడవ వ్యక్తిగా నిలిచారు. గతేడాది ఉన్న సంపన్నుల జాబితాతో పోలిస్తే.. ప్రపంచంలో ఉన్న బిలియనీర్ల సంపద ఇప్పుడు 12.2 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. మార్చి 2022లో 12.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న సంపదలో ఈ ఏడాదికి 500 బిలియన్ డాలర్ల తగ్గుదల నమోదైంది.
ఫోర్బ్స్ జాబితాలోని ప్రపంచ బిలియనీర్ల సంఖ్య గత ఏడాది 2,668గా ఉంది. 2023 నాటికి ఆ సంఖ్య 2,640కి పడిపోయింది. మరోవైపు భారత్‌లోని బిలీయనీర్ల సంఖ్య 2022లో ఉన్న 166 నుంచి ఈ ఏడాది 169కు చేరుకుంది. స్టాక్ విలువ పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల సంఖ్య తగ్గేందుకు కారణాలని ఫోర్బ్స్ పేర్కొంది.
ఇక అత్యంత సంపన్నులు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సూమరు 4.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో 735 మంది సభ్యులున్నారు. మరోవైపు హాంకాంగ్, మకావుతో పాటు చైనా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అక్కడి కుబేరుల అందరి సంపద విలువ కలిపి రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య సుమారు 562. ఇక మూడో స్థానాన్ని భారత్ సొంతం చేసుకుంది. భారత్‌లో సుమారు 169 మంది బిలీయనీర్లు ఉన్నారు. వీరి సంపద విలువ సుమారు 675 బిలియన్ డాలర్లు.