ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సింగపూర్‌లోనూ కుటుంబ కార్యాలయం తెరిచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు స్థలాన్ని సైతం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి ఆఫీస్ నిర్వహణ, సిబ్బంది నియామకాల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఓ మేనేజర్‌ను నియమించినట్లు సమాచారం. ఏడాది వ్యవధిలో అక్కడ కార్యకలాపాలు చురుగ్గా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి తెలిపారు. ముకేశ్ సతీమణి నీతా అంబానీ స్వయంగా ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీమంతులు వారి కుటుంబ సంపద, పెట్టుబడుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కార్యాలయాలను తెరుస్తుంటారు. వీటినే 'ఫ్యామిలీ ఆఫీస్'గా వ్యవహరిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బిలియనీర్లు సింగపూర్‌ను ఇందుకు వేదికగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ప్రముఖ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ రే డాలియో ఇక్కడే తమ కుటుంబ కార్యాలయాలను ప్రారంభించారు. తక్కువ పన్నులు, భద్రతాపరమైన సమస్యలు లేకపోవడంతో చాలా మంది ఈ దేశాన్ని ఎంచుకుంటున్నారు. 2021 వరకు ఇలా ఆఫీసులు ప్రారంభించిన ధనవంతుల సంఖ్య 700కు చేరినట్లు సింగపూర్ ప్రభుత్వ అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంత క్రితం ఏడాది ఈ సంఖ్య 400గా ఉంది.
సింగపూర్‌కు వెళుతున్న కుబేరుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడ కార్లు, ఇళ్లు సహా ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు దేశ సమగ్ర అభివృద్ధి కోసం ధనవంతులు అధిక పన్నులు చెల్లించాల్సి రావొచ్చని ఉప ప్రధాని లారెన్స్ వోంగ్ ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగమే..!
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికల్లో సింగపూర్‌లో కార్యాలయం తెరవడం ఒక భాగమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భారత్ వెలుపల ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 2021 ఏప్రిల్‌లో యూకేలోని ప్రఖ్యాత స్టోక్ పార్క్‌ను 79 మిలియన్ డాలర్లకు ముకేశ్ కుటుంబం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో మాండరిన్ ఓరియెంటల్ న్యూయార్క్‌లోనూ 73.4 శాతం వాటాలను కొనుగోలు చేసింది.
మరోవైపు దుబాయ్‌లో 80 మిలియన్ డాలర్లకు ఓ పెద్ద విల్లాను సొంతం చేసుకుంది. 2021లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో అరామ్‌కో ఛైర్మన్ చేరిన విషయం తెలిసిందే. తమ సంస్థను అంతర్జాతీయంగా విస్తరించే ప్రణాళికల్లో ఇది ఓ ముందడుగని ముకేశ్ అప్పట్లో ప్రకటించారు. మున్ముందు తమ 'ఇంటర్నేషనల్ ప్లాన్స్' గురించి మరింత వింటారని తెలిపారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 83.7 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో ఉన్నారు. సంప్రదాయ ఇంధన శుద్ధి, పెట్రోకెమికల్స్ నుంచి రిలయన్స్ క్రమంగా ఇతర ఆధునిక వ్యాపారాల్లోకి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇ-కామర్స్, స్వచ్ఛ ఇంధనం, రిటైల్, టెలీకమ్యూనికేషన్స్.. రంగాలపై ప్రధానంగా దృష్టి సారించింది. 2020లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్.. మెటా, గూగుల్ వంటి బడా సంస్థల నుంచి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని సమీకరించింది.
ఇదీ చదవండి: 'డాలరు విలువ రూ.85కు చేరొచ్చు'.. విశ్లేషకుల అంచనా
డిజిటల్ రూపాయి వస్తోంది.. 'నమూనా పత్రం' రిలీజ్ చేసిన ఆర్‌బీఐ