Mukesh Ambani Forbes: ముకేశ్ అంబానీ ఏడాది వ్యవధిలో కేవలం 7 శాతం వృద్ధినే సాధించినా.. దేశంలో, ఆసియాలో అగ్రగామి కుబేరుడిగా కొనసాగారు. ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో నిలిచిన ఆయన సంపద 90.7 బిలియన్ డాలర్లకు (రూ.6.8 లక్షల కోట్లు) చేరుకుంది. ఇక గౌతమ్ అదానీ ఏడాది వ్యవధిలో ఏకంగా 40 బిలియన్ డాలర్లను జత చేసుకుని 90 బిలియన్ డాలర్లతో (దాదాపు రూ.6.75 లక్షల కోట్లు) ఆసియాలో, భారత్‌లో రెండో అత్యంత ధనవంతుడయ్యారు. ఇటు అంబానీ.. ఇటు అదానీలు వచ్చే దశాబ్దంలో హరిత ఇంధనంపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు.
India richest billionaires: గత ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా చాలా వరకు కంపెనీలు డిజిటల్‌కు మారడం వల్ల ఐటీ రంగం రికార్డు స్థాయిలో 200 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో ఐటీ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్ గౌరవ ఛైర్మన్ శివ్‌నాడార్ సంపద 22% మేర పెరగడం వల్ల భారత కుబేరుల్లో మూడో స్థానంలో కొనసాగారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా దేశంలోనే అతిపెద్ద కరోనా టీకా తయారీదారు కావడంతో భారీ లాభాలందుకున్నారు. తన సంపదను రెట్టింపు చేసుకుని 4 స్థానాలు మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి చేరారు. గతేడాది ప్రపంచ అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలోకి చేరిన డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ 20 బిలియన్ డాలర్ల నికర సంపదతో అయిదో ర్యాంకును కైవసం చేసుకున్నారు.
'ఉక్కు' మహిళ సావిత్రి: ఇక ఉక్కు ధరలు పెరగడంతో సావిత్రి జిందాల్ ఈ ఏడాది అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలోకి చేరారు. మొత్తం జాబితాలోని 13 మంది మహిళా కుబేరుల్లో సావిత్రి కూడా ఒకరు. కొత్తగా వచ్చిన 29 మందిలో ఫాల్గుణి నాయర్ ఒకరు. నవంబరులో నైకాను లిస్టింగ్ చేయడం ద్వారా దేశంలోనే స్వయంశక్తితో ఎదిగిన మహిళల్లో అత్యంత ధనవంతురాలయ్యారు. గతేడాది ఐపీఓలకు బ్లాక్‌బస్టర్ ఏడాదిగా నిలిచి 60 కంపెనీలు కలిసి 15.6 బిలయన్ డాలర్ల దాకా నిధులను సమీకరించాయని ఫోర్బ్స్ గుర్తు చేసింది.
ఇదీ చదవండి: ఆగని వడ్డన.. ముంబయిలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు