Mukesh Ambani Property: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ బాధ్యతలు స్వీకరించి 20 ఏళ్లు పూర్తయింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ ఆకస్మిక మరణంతో ముకేశ్ సంస్థ నిర్వహణను తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కంపెనీ ఆదాయం 17 రెట్లు పెరిగింది. లాభం 20 రెట్లు పుంజుకుంది.
2002లో ధీరూభాయ్ కన్నుమూశారు. తమ్ముడు అనిల్ అంబానీతో కలిసి ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహణ బాధ్యతల్ని స్వీకరించారు. పెద్దవాడైన ముకేశ్.. ఛైర్మన్, ఎండీ హోదాలో ఆసీనులయ్యారు. అనిల్ వైస్- ఛైర్మన్, అదనపు ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కంపెనీని విభజించాల్సి వచ్చింది. గ్యాస్, ఆయిల్, పెట్రోకెమికల్స్ విభాగాన్ని ముకేశ్ తీసుకోగా.. టెలికమ్యూనికేషన్స్, విద్యుదుత్పత్తి, ఆర్థిక సేవలు అనిల్ చేతికి వెళ్లాయి. కొన్నాళ్ల తర్వాత ముకేశ్ తిరిగి టెలికాం రంగంలోకి ప్రవేశించారు. సంస్థను రిటైల్, నూతన ఇంధన రంగాల్లోకి విస్తరించారు.
20 ఏళ్ల ముకేశ్ ప్రస్థానం అంకెల్లో..
- గత 20 ఏళ్లలో కంపెనీ మార్కెట్ విలువ ఏటా సగటున 20.6 శాతం వృద్ధి చెందింది. 2002 మార్చిలో రూ.41,989 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2022 మార్చి నాటికి రూ.17,81,841 కోట్లకు చేరింది.
- 2001- 02లో ఆదాయం రూ.45,411 కోట్ల నుంచి 2021- 22 నాటికి రూ.7,92,756 కోట్లకు చేరింది. 15.4 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
- నికర లాభం 16.3 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ.3,280 కోట్ల నుంచి రూ.67,845 కోట్లకు పెరిగింది.
- ఎగుమతులు ఏటా సగటున 16.9 శాతం పెరిగి రూ.11,200 కోట్ల నుంచి రూ.2,54,970కోట్లకు చేరింది.
- మొత్తం ఆస్తులు 18.7 శాతం లెక్కన ఎగబాకి రూ.48,987 కోట్ల నుంచి రూ.14,99,665 కోట్లకు పెరిగాయి.
- ఈ రెండు దశాబ్దాల్లో రిలయన్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన మదుపర్ల సంపద రూ.17.4 లక్షల కోట్లకు చేరింది. ఏటా రూ.87,000 కోట్లు వృద్ధి చెందడం విశేషం.
- మోతీలాల్ ఓస్వాల్ 26వ ‘వార్షిక సంపద సృష్టి’ అధ్యయనం ప్రకారం.. 2016- 20 మధ్య అత్యధిక సంపదను సృష్టించిన కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఈ సమయంలో సంస్థ రూ.10 లక్షల కోట్ల సంపదను మదుపర్లకు అందించినట్లు పేర్కొంది. ఈ విషయంలో రిలయన్స్ తన రికార్డును తానే తిరగరాసింది.
కంపెనీ విస్తరణ..
ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో రిలయన్స్‌ను ముకేశ్ ఇతర రంగాలకూ విస్తరించారు. 2016లో జియో ద్వారా టెలికాంలోకి ప్రవేశించి తిరుగులేని సంస్థగా నిలిపారు. అలాగే 2006లో రిటైల్ రంగంలోకీ అడుగు పెట్టారు. వివిధ కంపెనీ కొనుగోలుతో ఈ మధ్య కాలంలో ఈ రంగాన్ని విస్తరించడంలో దూకుడు పెంచారు. 2021లో కొత్త ఇంధనం రంగంలోకి ప్రవేశించారు. అందులోనూ వివిధ కంపెనీల కొనుగోళ్లు, భాగస్వామ్యాలతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా హరిత, స్వచ్ఛ ఇంధనంపై ప్రధానంగా దృష్టి సారించారు.
2002లో సింగిల్ ఆయిల్ రిఫైనరీగా ఉన్న జామ్‌నగర్ చమురు శుద్ధి కేంద్రం ఇప్పుడు ప్రపంచంలో ఒకే ప్రదేశంలో ఉన్న అతిపెద్ద శుద్ధికేంద్రంగా అవతరించింది. ఈ 20 ఏళ్లలో రిలయన్స్ చమురు శుద్ధి సామర్థ్యం రెండింతలైంది. సంప్రదాయంగా వస్తున్న ఈ వ్యాపారాన్ని ముకేశ్ అనేక రెట్లు విస్తరించడం విశేషం. రిలయన్స్ ‘ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ (E&P business)’ వ్యాపారం తొలిసారి 2002లో హైడ్రోకార్బన్‌ను గుర్తించింది. 2009 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. బ్రిటన్‌కు చెందిన ‘బీపీ కంపెనీ’ ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇటీవలే ఈ కంపెనీ రెండో ప్రాంతంలోనూ ఉత్పత్తి ప్రారంభించింది. తదనంతర కాలంలో బీపీని రిలయన్స్ భారత చమురు రిటైల్ వ్యాపారంలోకీ తీసుకొచ్చింది. భాగస్వామ్యంలో పెట్రోల్ పంపులను ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలుగా మార్చేందుకు ఇరు సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
కొత్త ఇంధన రంగంలోనూ వేగంగా దూసుకెళ్తున్న రిలయన్స్ వచ్చే మూడేళ్లలో రూ.75,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో జామ్‌నగర్‌లో ఐదు గిగా ఫ్యాక్టరీలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి ‘క్యార్ట్జ్-టు-మాడ్యూల్’ సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంతిమంగా ప్రపంచంలోనే అత్యంత చౌకగా సౌర విద్యుత్తు, హరిత ఉదజని ఇంధనాన్ని అందించడమే తమ లక్ష్యమని ముకేశ్ ప్రకటించారు. 2035 నాటికి కర్బన ఉద్గార తటస్థ కంపెనీగా రిలయన్స్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నిధుల సమీకరణలో రికార్డు..
నిధుల సమీకరణలో రిలయన్స్ 2020-21లో రికార్డు సృష్టించింది. రైట్స్ ఇష్యూ, జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ.2.5 లక్షల కోట్లు సమీకరించింది. పెట్టుబడులు పెట్టిన వాటిలో ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఉండడం గమనార్హం. 2021లో భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తడంలో రిలయన్స్‌దే కీలక పాత్ర. జియో ప్రవేశం తర్వాత భారత్ ప్రపంచ డేటా కేపిటల్‌గా అవతరించింది. 1 జీబీ డేటా ధర రూ.500 నుంచి రూ.12కు పడిపోయింది. ప్రపంచంలో బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో 2016లో 150వ స్థానంలో ఉన్న భారత్ 2018లో ఏకంగా అగ్రస్థానానికి చేరింది.
స్టాన్‌ఫోర్డ్‌లో విద్యాభ్యాసం..
యెమెన్‌లోని అదెన్ నగరంలో ధీరూభాయ్ పనిచేస్తుండగా.. ముకేశ్ అక్కడే జన్మించారు. అప్పట్లో ధీరూభాయ్ ఓ గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తుండేవారు. ముంబయిలోని ‘యూనివర్సిటీ ఆఫ్ బాంబే’లో ముకేశ్ కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్‌లో ‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’లో మాస్టర్స్ చేయడానికి వెళ్లారు. కానీ, 1981లో మధ్యలోనే తిరిగొచ్చి వ్యాపారంలోకి ప్రవేశించారు. కమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్రా, పెట్రో కెమికల్స్, పెట్రోలియం రిఫైనింగ్, పాలియెస్టర్ ఫైబర్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ రంగాల్లో కంపెనీని విస్తరించడంలో తండ్రితో కలిసి పనిచేశారు. 2007లో భారత్‌లో రూ.లక్ష కోట్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా నిలిచారు. అప్పటి నుంచి ఇటీవలి వరకు భారత్‌లోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగారు. కొన్ని నెలల క్రితం ఆ స్థానానికి గౌతమ్ అదానీ చేరడంతో ముకేశ్ వెనుకబడ్డారు.
దాతృత్వంలోనూ..
రిలయన్స్ ఫౌండేషన్ పేరిట 2010లో ముకేశ్ దాతృత్వ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన సతీమణి నీతా అంబానీ దీని కార్యకలాపాలను చూసుకుంటున్నారు. గ్రామీణ సాధికారిత, పౌష్టికాహార భద్రత, విద్య, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది. భారత్‌లో ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కింద అత్యధికంగా ఖర్చు చేస్తున్న సంస్థ రిలయన్సే.