మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మోడళ్ల కార్ల యజమానులకు అలర్ట్. ఆ మోడల్ కార్లలో వెనుక సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో లోపాలను సరిచేసేందుకు.. 11,177 కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ సోమవారం తెలిపింది. మారుతీ సుజుకీ కార్ల రీకాల్ గురించి స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. 2022 ఆగస్టు 8 నుంచి నవంబరు 15 మధ్య తయారైన ఈ మోడల్ కార్లలో.. ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. లోపాలున్న భాగాలను ఉచితంగా మార్చి ఇస్తామని తెలిపింది.
అంతకుముందు కూడా ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్‌లో లోపాలు సరిదిద్దేందుకు.. 17,362 కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ వెల్లడించింది. 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 మధ్యలో తయారైన కార్లను వెనక్కు పిలిపిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆల్టో కే10, బ్రెజా, బలీనో, ఎస్ప్రెస్సో, ఈకో, గ్రాండ్ విటారా మోడళ్ల కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. సమస్య తీవ్రత దృష్ట్యా.. ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్లోని లోపాన్ని సరిచేసే వరకు ఆ కార్లను డ్రైవ్ చేయొద్దని సూచించింది మారుతి సుజుకీ.