Maruti Suzuki news: ఏప్రిల్‌లోనూ వాహన టోకు విక్రయాలు తగ్గాయి. దేశీయ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ టోకు విక్రయాలు ఏప్రిల్‌లో 1,50,661 వాహనాలకు పరిమితమయ్యాయి. 2021 ఏప్రిల్‌లో డీలర్లకు కంపెనీ సరఫరా చేసిన 1,59,691 వాహనాలతో పోలిస్తే ఇవి 6 శాతం తక్కువ. సరఫరా అంతరాయాల వల్ల ఉత్పత్తి సమస్యలు ఎదురు కావడంతో మారుతీతో పాటు హ్యుందాయ్ మోటార్‌లు తమ ప్లాంట్ల నుంచి డీలర్లకు వాహన సరఫరాలు గత నెలలో తగ్గించాయి. అయితే టాటా మోటార్స్, టయోటా, స్కోడా ఆటో మాత్రం గణనీయ వృద్ధి నమోదు చేశాయి.
- మారుతీ దేశీయ విక్రయాలు 1,42,454 నుంచి 7 శాతం తగ్గి 1,32,248 వాహనాలకు పరిమితమయ్యాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్-ప్రెసోల విక్రయాలు 25,041 నుంచి 32 శాతం తగ్గి 17,137కు పరిమితమయ్యాయి. కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ విక్రయాలు 72,318 నుంచి 18 శాతం తగ్గి 59,184గా నమోదయ్యాయి. మధ్య స్థాయి సెడాన్ సియాజ్ విక్రయాలు 1,567 నుంచి 579కు తగ్గాయి. యుటిలిటీ వాహన విభాగంలో విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎర్టిగా విక్రయాలు 25,484 నుంచి 33 శాతం పెరిగి 33,941కు చేరాయి. ఎగుమతులు 17,237 నుంచి 7 శాతం పెరిగి 18,413కు చేరాయి.
- టాటా మోటార్స్ విక్రయాలు 41,729 నుంచి 74 శాతం పెరిగి 72,468గా నమోదయ్యాయి. దేశీయ విక్రయాలు 39,401 నుంచి 81 శాతం దూసుకెళ్లి 71,467కు చేరాయి. మొత్తం ప్రయాణికుల వాహన సరఫరాలు (డీలర్లకు) 25,095 నుంచి 66 శాతం పెరిగి 41,587కు చేరాయి. వాణిజ్య వాహన విక్రయాలు కూడా 14,306 నుంచి 29,880కు చేరాయి.
- టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) సరఫరాలు 9,600 నుంచి 57 శాతం పెరిగి 15,085కు చేరాయి. స్కోడా ఆటో ఇండియా విక్రయాలు 961 నుంచి అయిదింతలు పెరిగి 5,152 వాహనాలకు చేరాయి. మిగతా సంస్థల వాహన విక్రయాలు పట్టికలో..
ఇదీ చదవండి: జీఎస్టీ ఆల్టైమ్ రికార్డు.. ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లు