Loan Repayment Tips : సాధారణంగా చాలా మంది ఆర్థిక అవసరాల కోసం రుణాలు చేస్తూ ఉంటారు. మరి కొందరు అవసరం లేకున్నా, అనవసరపు ఖర్చుల కోసం లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా తమకు వీలైనన్ని చోట్ల రుణాలు చేస్తూ పోతారు. కానీ తర్వాత వాటిని చెల్లించలేక తలలు పట్టుకుంటారు. కుప్పలు తెప్పలుగా ఉన్న రుణాలు తీర్చలేక, ఆర్థికంగా చితికి పోతారు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. సంపాదనలో సింహ భాగం ఈ రుణాలు, వాటిపై వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది. కనుక వీలైనంత త్వరగా రుణాలు చెల్లించి, భారం తగ్గించుకోవడం మంచిది. ఇక్కడ తెలిపిన 6 చిట్కాలు పాటించడం వల్ల మీరు తొందరగా లోన్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. రుణాల జాబితా తయారు చేసుకోవడం
Prepare List Of Loans : మీరు మొదట చేయాల్సిన పని.. మీరు తీర్చాలిన రుణాల జాబితాను తయారు చేసుకోవడం. అలాగే మీ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు సహా మీ రుణాలపై విధించే వడ్డీ రేట్లను క్రమం తప్పకుండా ట్రాక్ చేయడం. ప్రతి నెలా ఎంత చెల్లిస్తున్నారు? గడువు ఎంత ఉంది? మిగిలిన బ్యాలెన్స్ ఎంత? పూర్తి లోన్ చెల్లించడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది? ఇలాంటి వివరాలు అన్నీ చూసుకోవాలి.
2. అధిక వడ్డీ ఉన్న లోన్ ముందుగా చెల్లించడం
Repay Big Loan First : మీరు ఒకటి కంటే ఎక్కువ లోన్స్ చెల్లించాల్సి ఉంటే.. మిగిలిన వాటి కంటే ముందుగా, అత్యధిక వడ్డీ రేటు ఉన్న రుణం చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇదే సమయంలో మీ ఇతర రుణాలపైనా దృష్టి సారించి, సకాలంలో వాయిదాలు చెల్లించేలా ప్లాన్ చేసుకోండి.
3. పన్ను ప్రయాజనాలు
Loan Repayment Tax Benefits : కొన్ని నిర్దిష్ట రుణాలను ముందుగానే చెల్లించడం లేదా గడువులోగా చెల్లించడం ద్వారా పన్ను మినహాయింపులు లభిస్తాయి. అలాగే ఈ రుణాలను త్వరగా చెల్లించడం వల్ల వడ్డీ భారం కూడా తగ్గుతుంది.
4. ఆదాయం పెరిగితే.. చెల్లింపునూ పెంచడం
Increases Repayments With Rise In Income : రుణం త్వరగా చెల్లించడానికి మరో సులభమైన మార్గం ఏంటంటే.. ఆదాయానికి అనుగుణంగా చెల్లింపు చేయడం. ఒకవేళ మీకు అధిక ఆదాయం వస్తే.. ఎక్కువ మొత్తంలో లోన్ కట్టండి. లేకపోతే సరిపడా కట్టండి. ముందు మీ వేతనం తక్కువగా ఉండి తర్వాత పెరిగితే.. దానికి అనుగుణంగా ఈఎంఐ కూడా అధిక మొత్తంలో కట్టండి. ఈ విధానం వల్ల అనతి కాలంలోనే లోన్ క్లియర్ చేసుకోవచ్చు.
5. క్రెడిట్ కార్డు వినియోగం తగ్గించడం
Reduce Credit Card Usage : క్రెడిట్ కార్డును ఇష్టానుసారం వాడుతూ ఉంటే.. మీరు చిక్కల్లో పడ్డట్లే. మీకు అత్యవసరం అయితే తప్ప క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయవద్దు. ఒకవేళ క్రెడిట్ కార్డు వాడినా కూడా.. మీరు తీసుకునే రుణం.. కార్డు పరిమితిలో 30 శాతానికి మించకుండా చూసుకోండి. అలాగే ప్రతి నెలా సక్రమంగా బిల్లు చెల్లించండి. వీలైనంత వరకు అనవసర ఖర్చులకు క్రెడిట్ కార్డు వినియోగించకపోవడమే మంచిది.
6. ఇతర సర్దుబాట్లు అవసరం
Lifestyle Adjustments For Loan Repayment : మీరు రుణాలు తీసుకునే ముందు.. వాటిని సకాలంలో సమర్థవంతంగా చెల్లించగలను! అనే నమ్మకముంటేనే తీసుకోండి. అధిక EMIలను చెల్లించడానికి మీ దగ్గర తగిన నిధులు లేకుంటే.. జీవన శైలిలో అనివార్యంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అనవసర వస్తువుల కొనుగోలు, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ విధంగా పైన చెప్పిన 6 టిప్స్ పాటించడం ద్వారా త్వరగా మీ రుణాలు చెల్లించే అవకాశం ఉంటుంది.