Lay Off Compensation For Employees : చిన్న కంపెనీల నుంచి బహుళ జాతి సంస్థల వరకు ఉద్యోగుల తొలగింపు (Lay Off) పర్వం కొనసాగుతోంది. యాంత్రిక శక్తి వినియోగం పెరగడం వల్ల కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకోవడం కోసం.. నిర్దాక్షణ్యంగా ఉద్యోగులను పని నుంచి తొలగిస్తున్నాయి. వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఈ పరంపరను అన్ని కంపెనీలూ అనుసరిస్తున్నాయి. అయితే జాబ్ నుంచి మిమ్మల్ని తొలగించిన తరువాత.. ఆ కంపెనీ మీకు కచ్చితంగా కొన్ని పరిహారాలు అందించాల్సి ఉంటుంది. వాటినే పోస్ట్ లేఆఫ్ బెనిఫిట్స్ అంటారు. అసలు అవేంటి? వాటిని ఎలా పొందాలి? అనే అంశాల గురించి ఇందులో తెలుసుకుందాం. అసలు పోస్ట్ లేఆఫ్ బెనిఫిట్స్ గురించి చాలా మందికి తెలియదు. వీటిని మీరు తెలుసుకుంటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించినప్పుడు.. మీరు కంపెనీ నుంచి ఈ పరిహారాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ( Employee Benefits After Termination )
1. సెవెరెన్స్ పే
Severance Pay : సెవెరెన్స్ పే అనేది ఒక సంస్థ తన ఉద్యోగులను తొలగించే సందర్భంలో అందించే పరిహారం. ఇది ఆయా కంపెనీలను అనుసరించి మారుతూ ఉంటుంది. వాస్తవానికి కంపెనీలు తమ ఉద్యోగులకు రెగ్యులర్ వేతనం మాత్రమే కాకుండా, ఉయోగించుకోని వెకేషన్, సిక్ లీవ్స్‌కు సమానమైన పరిహారం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, స్టాక్ ఆప్షన్స్, మెడికల్ ఇన్సూరెన్స్‌ను అందించాల్సి ఉంటుంది.
ఉద్యోగులకు అందించాల్సిన సెవెరెన్స్ పే విషయంలో రెండు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, 1947 – ఈ చట్టం ప్రకారం, ఒక యజమాని తమ దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తే.. అందుకు కచ్చితంగా పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఫార్ములా ఆధారంగానే ఈ సెవరెన్స్ పే లెక్కించాలని కూడా చట్టం కచ్చితంగా పేర్కొంది.
- గ్రాట్యుటీ చట్టం, 1972 – గ్రాట్యుటీ అనేది ఒక సంస్థలో ఉద్యోగి సేవలు ముగిసినప్పుడు (రిటైర్మెంట్ సమయంలో) వారికి అందించే మొత్తం. అయితే, ఈ మొత్తాన్ని పొందేందుకు, మీరు కనీసం 5 సంవత్సరాల పాటు ఆ సంస్థలో పని చేయాలి. మీరు దీనికి అర్హులైతే, మీ ఉద్యోగాన్ని తొలగించే సమయంలో గ్రాట్యుటీ మొత్తం మీరు పొందడానికి అర్హులు అవుతారు.
2. ఆరోగ్య బీమా మరియు వైద్య ప్రయోజనాలు
Health Insurance And Medical Benefits : చాలా కంపెనీలు ఉద్యోగ ఒప్పంద సమయంలోనే వీటిని అందజేస్తాయి. చాలా కంపెనీలు ఈ ప్లాన్ ప్రయోజనాలను ఉద్యోగి కుటుంబ సభ్యులకు, అతని జీవిత భాగస్వాములకు కూడా వర్తింపజేస్తాయి. అయితే కొన్ని కంపెనీలు లేఆఫ్ తర్వాత కూడా కొంత కాలం పాటు ఈ సేవల్ని ఉద్యోగులకు అందజేస్తాయి. ఉదాహరణకు, ఈ ఏడాది జనవరిలో గూగుల్ కొంత మందిని లేఆఫ్ చేసింది. అయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. లేఆఫ్ కారణంగా ప్రభావితమైన ఉద్యోగులకు ఒక ఈ మెయిల్ పంపించారు. అందులో 6 నెలల పాటు ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కనుక ఆరోగ్య బీమా, జీవిత బీమా కవరేజ్ ఎంతకాలం కొనసాగుతుందని లేఆఫ్ సమయంలోనే కంపెనీని అడగండి. దీనితోపాటు దాన్ని కొనసాగించడానికి ఏమైనా ఖర్చవుతుందా? అనే విషయాన్నీ తెలుసుకోండి.
3. అవుట్‌ప్లేస్‌మెంట్ సర్వీసులు
Outplacement Services : ఈ రోజుల్లో అనేక కంపెనీలు అవుట్ ప్లేస్మెంట్ సర్వీసుల్ని అందిస్తున్నాయి. కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగులకు కెరీర్ కౌన్సెలింగ్, శిక్షణ, రెజ్యూమ్ రైటింగ్, జాబ్ సెర్చింగ్ లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తాయి. దీని వల్ల వారు తిరిగి ఉద్యోగం పొందడానికి లేదా లేరే జాబ్‌లో సెటిల్ కావడానికి ఉపయోగపడతాయి. మీరు జాబ్‌లో చేరే సమయంలో ఇలాంటి సౌకర్యం లేకపోతే.. లేఆఫ్ అయిన సమయంలో మీ అభ్యర్థన మేరకు ఈ సర్వీసులు అందించే అవకాశముంది.
4. స్టాక్ పెట్టుబడులు
Stock Options : కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు కంపెనీ షేర్లను బహుమతిగా ఇస్తాయి. అలాగే కొన్ని సంస్థలు తమ కంపెనీ స్టాక్ల్లో ఉద్యోగులు పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తాయి. అంటే కంపెనీ షేర్లలో మీకూ వాటా కల్పిస్తాయి. ఒక వేళ మిమ్మల్ని అనుకోని విధంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే.. అప్పుడు మీరు కంపెనీ షేర్లను డిమాండ్ చేయవచ్చు.
ఏ కంపెనీ అయినా కానివ్వండి.. సడెన్‌గా జాబ్‌లో నుంచి తీసేస్తే.. ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా తయారువుతుంది. ఈ కష్టపరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ మీ ఆర్థిక స్థితి పటిష్ఠంగా ఉండేలా చూసుకోండి. దీనితో పాటు సాధ్యమైనంత త్వరగా వేరే ఉపాధి అవకాశాలు పొందేందుకు తగిన వ్యూహాలు రచించుకోండి.