IRCTC Booking Issue : ప్రముఖ రైల్వే టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా టికెట్ బుకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ సర్వీసెస్ అందుబాటులో లేవని పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్‌ఐఎస్ సాంకేతిక బృందం ప్రయత్నిస్తోందని తెలిపింది.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బుకింగ్..
IRCTC Downtime : సమస్య పరిష్కారమై, సేవలు అందుబాటులోకి వస్తే.. ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తామని చేస్తామని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అప్పటివరకు ప్రత్యామ్నాయ మార్గాలైన అమెజాన్, మేక్‌మైట్రిప్ వంటి బీ2సీ వెబ్‌సైట్ లేదా యాప్ల ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వీటిల్లోనూ టికెట్లు బుక్ కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కాగా, తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఏసీ తరగతి (2A/3A/CC/EC/3E) ఉదయం 11:00 గంటలకు నాన్ ఏసీ తరగతికి (SL/FC/2S) కోసం తత్కాల్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా.. ఐఆర్‌సీటీసీలో టెక్నికల్ సమస్య కారణంగా చాలా మంది టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు.
ఫిర్యాదుల వెల్లువ..
IRCTC Complaints Twitter : టికెట్ బుకింగ్ సమస్యలపై ప్రయాణికులు సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్లతో ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. "దయచేసి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించండి. నేను టికెట్ బుకింగ్ కోసం వెబ్సైట్లో లాగిన్ అవ్వగా టెక్నికల్ ప్లాబ్లమ్ చూపించింది. 5 సార్లు నా డబ్బులు కట్ అయ్యాయి. అయినా టికెట్ మాత్రం బుక్ అవ్వలేదు." అని ఓ వినియోగదారుడు ఐర్సీటీసీకి ఫిర్యాదు చేశాడు. నేను అత్యవసరంగా మా ఇంటికి తిరిగి వెళ్లాలి. కానీ వెబ్సైట్లో మాత్రం తత్కాల్ టికెట్ బుక్ అవ్వట్లేదు. దయచేసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించండి" అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.
IRCTC వెబ్సైట్లో లాగిన్ అయిన వ్యక్తులకు "ప్రస్తుతం ఈ-టికెటింగ్ బుకింగ్ సర్వీసెస్ అందుబాటులో లేవు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. ఫిర్యాదుల కోసం కస్టమర్ కేర్ నంబర్ : 14646,0755-6610661, 0755-4090600లను సంప్రదించండి. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్స్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోండి." అని సందేశం కనిపిస్తోంది.