small savings schemes interest rates: నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్(పీపీఎఫ్) సహా మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని తెలిపింది. 2020-21 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం నుంచి వీటిపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవటం గమనార్హం. తాజా నిర్ణయంతో పీపీఎఫ్, ఎన్ఎస్సీలపై తొలి త్రైమాసికంలో వడ్డీ రేటు వరుసగా 7.1శాతం, 6.8 శాతంగా కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
"2022, ఏప్రిల్ 1న మొదలై.. 2022, జూన్ 30న ముగియనున్న తొలి త్రైమాసికానికి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. 2021-22 ఆర్థిక ఏడాది చివరి త్రైమాసికంలో అమలవుతున్న వడ్డీ రేట్లే ఇప్పుడూ వర్తిస్తాయి."
- కేంద్రం ఆర్థిక శాఖ.
పథకం | వడ్డీ రేటు% | వడ్డీ జమ/చెల్లింపు వ్యవధి |
పీపీఎఫ్ | 7.1 | ఏడాదికోసారి |
ఎన్ఎస్సీ | 6.8 | ఏడాదికోసారి |
ఏడాది టర్మ్ డిపాజిట్ | 5.5 | మూడు నెలలకోసారి |
సుకన్య సమృద్ధి యోజన | 7.6 | మూడు నెలలకోసారి |
ఐదేళ్ల వయోవృద్ధుల పొదుపు పథకం | 7.4 | మూడు నెలలకోసారి |
పొదుపు ఖాతాలపై | 4 | ఏడాదికోసారి |
1-5 ఏళ్ల టర్మ్ డిపాజిట్లు | 5.6-6.7 | మూడునెలలకోసారి |
ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లు | 5.8 | మూడు నెలలకోసారి |
ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్- డీఏ పెంపు