IT return last date: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 31. గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు.. ఆదాయం లభించిన మార్గాలను బట్టి సంబంధిత ఫారాల్లో రిటర్నులను సమర్పించాలి.
ఉద్యోగం చేస్తున్న వారికి యాజమాన్య సంస్థలు ఫారం-16ను జారీ చేస్తాయి. దీని ఆధారంగా రిటర్నులు సులభంగా దాఖలు చేయొచ్చు. కొంతమందికి ఈ ఫారం-16 అందకపోవచ్చు. ఇలాంటి వారు రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం లేదా అనే అనుమానాలున్నాయి. రిటర్నులు సమర్పించేందుకు ఈ ఫారం అవసరం. అందులో పేర్కొన్న వివరాలు, 26ఏఎస్, ఐఏఎస్ తదితరాలను పోల్చి చూసుకొని, రిటర్నులు దాఖలు చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫారం-16 లేకున్నా రిటర్నులను దాఖలు చేయొచ్చు.
వేతన వివరాలతో..
ఫారం-16 అందుబాటులో లేనప్పుడు యజమాని నుంచి అందుకున్న వేతన ధ్రువీకరణ ఆధారంగా ఐటీఆర్-1లో రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఆదాయంలో మీరు వాస్తవంగా చేసిన సెక్షన్ 80సీ పరిధిలోని పెట్టుబడులు, ఇంటి అద్దె, ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియం తదితర మినహాయింపులను క్లెయిం చేసుకోవచ్చు.
- ఆదాయపు పన్ను పోర్టల్ నుంచి ఫారం 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఆదాయానికి సంబంధించిన వివరాలు అందులో కనిపిస్తున్నాయా చూసుకోండి.
ఈ అంశాలతో జాగ్రత్త..
ప్రస్తుతం ఐటీఆర్ ఫారాలు ముందే నింపి అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఒకసారి పరిశీలించడం తప్పనిసరి.
- పేరు, పుట్టిన తేదీ వివరాలను పాన్‌లోని సమాచారం ఆధారంగా తీసుకుంటారు. వీటిని మార్చడం సాధ్యం కాదు. చిరునామా, ఇ-మెయిల్, ఫోన్ నెంబరును మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలో మీరు దాఖలు చేసిన వివరాలు ఈసారీ ఇక్కడ కనిపిస్తాయి. మార్పులుంటే అప్‌డేట్ చేయాలి.
- వేతనం వివరాలకు సంబంధించి.. యాజమాన్యం వివరాలు, చిరునామా, టాన్ తదితరాలన్నీ కనిపిస్తాయి. ఫారం-16లో ఉన్న వివరాలతో ఇవి సరిపోవాలి. కొన్నిసార్లు ఇది కనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు సొంతంగా వీటిని నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఇంటి రుణానికి చెల్లించే వడ్డీని నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని అద్దెకు ఇచ్చి, మీరు వేరే చోట అద్దెకు ఉంటున్నప్పుడు.. ఇంటి రుణం వడ్డీతోపాటు, హెచ్‌ఆర్‌ఏనూ క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇలాంటప్పుడు మీ సొంతింటికి లభించిన ఇంటి అద్దెను ఆదాయంలో కలిపి చూపించాలి.
- ఇతర ఆదాయాలను ఒకసారి సరిగా చూసుకోండి. ముఖ్యంగా డివిడెండ్లు, పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ మొత్తాలను జాగ్రత్తగా నమోదు చేయండి. మీరు వాస్తవంగా పొందిన మొత్తానికీ, ఆదాయపు పన్ను రిటర్ను ఫారంలో చూపిస్తున్న దానికీ వ్యత్యాసం లేకుండా చూసుకోండి.
- కొన్నిసార్లు మీరు మినహాయింపు ధ్రువీకరణలు ఇచ్చినా.. ఫారం-16లో అవి నమోదు కాకపోవచ్చు. ముఖ్యంగా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000లు ఐటీఆర్‌లో కనిపిస్తుందా చూసుకోండి. మీరు ఇచ్చిన మొత్తం మినహాయింపులన్నీ నమోదు కాలేదని అనుమానం ఉంటే.. సరైన మొత్తాన్ని ఐటీఆర్‌లో నమోదు చేయొచ్చు. అయితే, అవన్నీ మార్చి 31, 2022లోపు చేసిన పెట్టుబడులై ఉండాలి.
- ఆదాయపు పన్ను రిటర్నులలో ప్రతి చిన్న విషయమూ ఎంతో కీలకం. చిన్న పొరపాటు చేసినా.. రిటర్నులను ఆమోదించకపోయే అవకాశం ఉంది
గడువు తీరినా..
ఆదాయపు పన్ను రిటర్నుల గడువును పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, గడువు తీరిన తర్వాత డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ, దీనికి సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం కొంత అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారికి ఇది రూ.1,000. అంతకు మించి ఉన్నవారికి రూ.5,000 జరిమానా వర్తిస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారు.. స్వచ్ఛందంగా వాటిని సమర్పించవచ్చు. ఇలాంటివారికి గడువు దాటిన తర్వాతా ఎలాంటి అపరాధ రుసుము ఉండదు.
గడువు పెంచండి.. వెల్లువెత్తుతున్న వినతులు: రిటర్నుల దాఖలుకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఇప్పటికీ ఐటీ వెబ్‌సైట్‌లో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేయకుండా గడువులోపు దరఖాస్తు చేయాలనే ఒత్తిడి పెంచడం సరికాదని వారంటున్నారు. రోజుకు కోటి మంది రిటర్నులు దాఖలు చేసినా, పోర్టల్‌లో ఎలాంటి సమస్యా ఉండదని తరుణ్ బజాజ్ పేర్కొనడం గమనార్హం.
స్టాక్‌మార్కెట్ పెట్టుబడులపై:
కొవిడ్ పరిణామాల నేపథ్యంలో, గత రెండేళ్లుగా చాలామంది స్టాక్ మార్కెట్లో కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో కొంతమంది స్వల్పకాలిక మూలధన లాభాలను పొందితే, మరికొందరు నష్టపోయారు. వేతనం ద్వారా ఆదాయం ఉన్న వారు ఐటీఆర్ 1 దాఖలు చేయడం కాస్త సులువే. కానీ గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినవారు ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3లో రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లాభనష్టాలను గణించడం, నిబంధనల మేరకు తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసుకోవడం లాంటివి అంత సులువేమీ కాదు. వారికి నిపుణుల సలహాలు అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, గడువు తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించాలని పలువురు ఆదాయపు పన్ను విభాగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు లోగా రిటర్నులు దాఖలు చేయకపోతే.. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన దీర్ఘకాలిక మూలధన నష్టాలను భవిష్యత్‌లో వచ్చే లాభాలతో సర్దుబాటు చేసుకోవడం కుదరదు.
అవకాశం లేకపోవచ్చు..
ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ పొడిగించే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆడిట్ పరిధిలోకి వచ్చేవారు రిటర్నులు దాఖలు చేసేందుకు అక్టోబరు 31 దాకా సమయం ఉంటుంది. ఇప్పటికే 4.09 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేశారు. నేడు, రేపు అవకాశం ఉంది కాబట్టి, మొత్తం రిటర్నుల సంఖ్య క్రితం అసెస్‌మెంట్ ఏడాది స్థాయికి చేరే వీలుందని అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: ఆ చమురు సంస్థకు భారీ నష్టం.. మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?
'బంగారానికి గిరాకీ తగ్గొచ్చు'.. ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త..!