Emergency fund: ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ అనుకోకుండా పాడైపోవచ్చు. అసలే వేసవి కాలం. ఇప్పుడు కొత్తది కొనాల్సి రావచ్చు. వర్షాకాలం వచ్చే లోపు ఇంటికి ఏదైనా మరమ్మతు చేయాల్సి ఉండొచ్చు. అత్యవసరంగా దూర ప్రాంతానికి వెళ్లాల్సిన పని పడొచ్చు. కొంతకాలం ఆదాయం ఆగిపోవచ్చు. ఇలా ఎప్పుడైనా అక్కరకు వచ్చేలా మన చేతిలో అత్యవసర నిధిని అందుబాటులో పెట్టుకోవాల్సిందే. డబ్బు అవసరం ఉంటే.. స్నేహితులు, బంధువుల నుంచి తీసుకుంటాం అని అంటుంటారు కొందరు. కానీ, ఇది అన్ని సందర్భాల్లోనూ సరికాదు. దీనివల్ల మీరు ఎప్పుడో కొన్ని చిక్కులు ఎదుర్కోక తప్పదు. మానసికంగానూ ఒత్తిడి ఏర్పడుతుంది. అప్పటికప్పుడు క్రెడిట్ కార్డుపై రుణం తీసుకున్నా.. అధిక వడ్డీ చెల్లించక తప్పదు.
- ఇప్పటికే ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకొని డబ్బు అవసరం తీర్చుకోవచ్చు. మీ పెట్టుబడులు షేర్లలో ఉంటే.. మీకు అవసరమైనప్పుడు మార్కెట్ పతన దశలో ఉందనుకోండి. నష్టానికి అమ్ముకోవాల్సిందే. ఎఫ్‌డీల్లాంటివి ఉన్నా.. వాటిని రద్దు చేసుకుంటే.. అపరాధ రుసుము తప్పదు. ఇలా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. అనుకుంటున్న ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం ఏర్పడుతుంది.
- అందుకే, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా దాచుకోవాలి. గృహరుణం, ఇతర రుణాల ఈఎంఐలనూ లెక్కలోకి తీసుకోవాలి. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో మదుపు చేస్తుంటే.. ఆదాయం ఆగిపోయినప్పుడు ఆ పెట్టుబడులను కొనసాగిస్తారా లేదా నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి, అత్యవసర నిధిని పెంచుకోవాలి. వీలైనంత వరకూ కొనసాగించేందుకే నిర్ణయం తీసుకోవాలి.
- ఒకేసారి మొత్తం నిధిని పోగు చేయడం అందరికీ సాధ్యం కాదు. అందుకే, కొన్ని నెలలపాటు దీన్ని జమ చేయాలి. బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు లభించినప్పుడు కొన్నాళ్లపాటు ఈ నిధి కోసం పక్కన పెట్టాలి.
- అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం ఒక్కటే కాదు.. దాన్ని సులభంగా వెనక్కి తీసుకునే ఏర్పాటూ ఉండాలి. కేవలం మీ ఒక్కరికే దాని గురించి తెలియడం వల్ల ఉపయోగం ఉండదు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకూ దీని గురించి వివరాలు తెలియాలి. లేకపోతే అత్యవసరం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియకపోవచ్చు. దీనివల్ల మొత్తం ప్రయోజనమే దెబ్బతింటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర.. కావాల్సినంత సొమ్ము ఉంది. దాని గురించి ఎవరికీ చెప్పలేదు. అతను ప్రమాదానికి గురై, అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడనుకుందాం. అప్పుడు దాన్ని ఎలా వాడుకోవడం... అందుకే, వీలైనంత వరకూ అత్యవసర నిధిని ఉమ్మడి ఖాతాలో జమ చేయాలి.
ఇదీ చదవండి: ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి