How to Use UPI Lite in UPI Apps in Telugu : నేటి ఆధునిక కాలంలో యూపీఐ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న మొత్తాలకూ ఇప్పుడు యూపీఐని వినియోగించడం సర్వ సాధారణమైంది. టీ తాగిన దగ్గర నుంచి ఏ చిన్న వస్తువు కొన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంకు ఖాతాలోని డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ మనీ చెల్లించే క్రమంలో మనం యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ యూపీఐ చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(NPCI) 'యూపీఐ లైట్'(UPI Lite) అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ఎన్పీసీఐ ప్రవేశపెట్టింది. దీనిని 'ఆన్-డివైస్ వాలెట్' అని కూడా పిలుస్తారు. మొదట 'యూపీఐ లైట్'(UPI Lite) ఫీచర్‌ను పేటీఎం, ఫోన్‌పేలో తీసుకురాగా తర్వాత గూగుల్ పేలోనూ దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ 'యూపీఐ లైట్' అంటే ఏమిటి? దీనిని గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంలలో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
What is UPI Lite in Telugu :
యూపీఐ లైట్ అంటే ఏమిటంటే.. చిన్నమొత్తాల డిజిటల్ చెల్లింపుల కోసం ఎన్పీసీఐ తీసుకొచ్చిన ఫీచర్ ఈ యూపీఐ లైట్ (UPI Lite). మనం సాధారణంగా యూపీఐ యాప్‌ల ద్వారా పేమెంట్ చేయాలంటే పిన్ తప్పనిసరి. ఈ ఫీచర్‌ను మన యూపీఐ యాప్‌లలో(గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం) యాక్టివేట్ చేసుకుంటే సింగిల్ క్లిక్‌తో పిన్ ఎంటర్ చేయకుండానే చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా వ్యాలెట్‌లో కొంత మొత్తం డబ్బు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ఠంగా ఒకేసారి రూ.2 వేల వరకు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఒక రోజులో రెండుసార్లు చొప్పున మొత్తం 4వేల రూపాయలు ఈ వ్యాలెట్‌లో లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.
UPI Lite Benefits : అయితే సాధారణ యూపీఐ లావాదేవీలలో రోజువారీ పరిమితి రూ.1 లక్ష ఉంటే ఇందులో పేమెంట్ పరిమితి మొదట రూ.200గా ఉంటే ఇటీవల రూ.500కు పెంచారు. అంటే ఒకసారి రూ.500 వరకూ లావాదేవీని సింగిల్ క్లిక్‌తో పూర్తి చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్ సేవల్లో అంతరాయం ఉన్నా ఈ ఫీచర్‌తో పేమెంట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పైగా సత్వరమే దీని ద్వారా మీరు చేయాలనుకున్న లావాదేవీ పూర్తి చేయొచ్చు. ఇప్పుడు యూపీఐ యాప్(UPI Apps)లలో ఈ ఫీచర్ ఎలా యాక్టిపేట్ చేసుకోవాలో చూద్దాం..
How to Activate UPI Lite on Google Pay in Telugu :
Google Payలో UPI లైట్‌ని యాక్టివేట్ ఎలా చేసుకోవాలంటే..
- మొదట మీరు ఫోన్లో Google Pay యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని దానిని ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత ఎగువ కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కాస్త దిగువకు వస్తే 'యూపీఐ లైట్ యాక్టివేషన్‌కు సంబంధించిన ఆప్షన్' ఉంటుంది.
- దానిపై క్లిక్ చేసి.. మీ యూపీఐ లైట్ యాక్టివేషన్‌కు సంబంధించిన సూచనలు పాటించి దీనిని యాక్టివేట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత డబ్బును జోడించడానికి UPI లైట్‌కి మద్దతిచ్చే అర్హత గల బ్యాంక్ ఖాతాను ఎంచుకొని మనీ యాడ్ చేసుకోవాలి.
- ఇలా గూగుల్ పే ద్వారా మీరు పిన్ నమోదు చేయకుండానే మీ చెల్లింపులు చేయవచ్చు.
How to Activate UPI Lite on PhonePe :
PhonePeలో UPI లైట్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే...
- ఈ ఫీచర్ పొందాలంటే ముందుగా మీరు ఫోన్‌పే యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను వాడుతుండాలి.
- అప్పుడు మీరు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే మీకు హోమ్ స్క్రీన్‌పై 'UPI Lite' ఆప్షన్ కనిపిస్తోంది. అప్పుడు దానిపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు యూపీఐ లైట్ అకౌంట్లో జమ చేయదలచుకున్న మొత్తాన్ని అక్కడ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే మీ 'UPI Lite' ఖాతా యాక్టివేట్ అవుతుంది.
- ఆ తర్వాత మీరు ఎక్కడైనా ఏ క్యూర్ కోడ్‌నైనా స్కాన్ చేసి మీ పేమెంట్‌ను పూర్తి చేయొచ్చు.
How to Activate UPI Lite on Paytm in Telugu :
Paytmలో UPI లైట్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
- మొదట మీరు Paytm యాప్‌ని ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Introducing UPI Lite'పై క్లిక్ చేయాలి.
- అనంతరం Paytm UPI Lite ద్వారా సపోర్ట్ చేసే లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ఎంచుకొని.. UPI లైట్‌కి డబ్బుని యాడ్ చేయాలి.
- ఇలా మీరు మనీ యాడ్ చేసుకున్న తర్వాత.. ఎక్కడైనా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా UPI IDతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు డబ్బులు చెల్లించవచ్చు.
UPI ATM Cash Withdrawal Process : 'యూపీఐ ఏటీఎం'తో.. ఇకపై కార్డ్ లేకుండానే క్యాష్ విత్‌డ్రా!
Digital Payments Security : డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!