How to Save LPG Gas while Cooking : ప్రస్తుతం రోజువారీ జీవితంలో గ్యాస్ సిలిండర్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. నేటికీ గ్రామాల్లో కట్టెల పొయ్యిలు ఉన్నా.. ఎక్కువ మొత్తంలో వంట గ్యాస్‌నే వాడుతున్నారు. ఇక నగరాల్లో నివసించే ప్రజలయితే ఇంట్లో గ్యాస్ సిలిండర్లు లేకుండా తమ జీవితాన్ని ఊహించలేరు. కొంతమంది రెండు, మూడు సిలిండర్లు కలిగి ఉంటారు. ఎందుకంటే సిలిండర్ ఎప్పుడు అయిపోతుందోనని మరో దాన్ని ముందుగానే బుక్ చేసుకొని తీసుకుంటారు. ఇంకొందరు మాత్రం గ్యాస్ తక్కువ రోజులకే అయిపోతుంటే.. ఏం చేయాలో అర్థంకాక ఆందోళన చెందుతారు.
Gas Cylinder Saving Tips in Telugu : ఇదిలా ఉంటే.. రోజురోజుకు వంట గ్యాస్ ధర పెరుగుతూనే ఉంది. అలాగని టెన్షన్ పడుతూ కూర్చుంటే గ్యాస్ ధర ఒక్కసారిగా తగ్గదు కదా! కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే వంటగ్యాస్ వినియోగించే వారు వీలైనంత మేర గ్యాస్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం ప్రయత్నించాలి. అలాగని వంట చేయకూడదని మేం చెప్పడం లేదు. మీరు కనుక మేము చెప్పబోయే ఈ టిప్స్ ఫాలో అవుతూ గ్యాస్ వాడారంటే ఇటు గ్యాస్‌తో పాటు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
బర్నర్ శుభ్రంగా ఉంచుకోవాలి.. మొదటగా మీరు గ్యాస్ స్టవ్‌లోని బర్నర్‌ను ఎప్పుడూ శుభ్రంగా, మురికి లేకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే మురికి ఉంటే గ్యాస్ రాకుండా అడ్డుపడి సమస్యలను కలిగిస్తుంది. దాంతో మంట చిన్నగా వస్తుంది. మీకు తెలియకుండా గ్యాస్ మాత్రం ఖాళీ అవుతూనే ఉంటుంది. బర్నర్ శుభ్రంగా లేకపోతే గ్యాస్ లీకేజీ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ గ్యాస్ స్టవ్ బర్నర్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
కంటైనర్లలో నీరు లేకుండా చూసుకోండి : కొందరు ఉదయాన్నే త్వరగా త్వరగా పని అయిపోవాలనే ఉద్దేశంతో.. వంట గిన్నెలు క్లీన్ చేసిన వెంటనే వంట చేసేందుకు వస్తారు. మరి కొద్దిమంది.. రాత్రి తోమేందుకు ఉంచిన గిన్నెలను మరుసటి రోజు ఉదయం హడావుడిగా శుభ్రం చేసి.. వంటకు ఉపయోగిస్తుంటారు. తడిగా ఉన్న వంటపాత్ర ఆరేందుకు 2 నుంచి 4 నిమిషాలు పట్టవచ్చు. ఇలా ఒక రోజు అయితే ఏం కాదు.. కానీ రోజు ఇదే రిపీట్ అయితే మాత్రం.. చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇది కూడా గ్యాస్ త్వరగా అయిపోవడానికి ఒక కారణం. కాబట్టి వంట వండే గిన్నెలు పొడిగా ఉండేలా చూసుకోవాలి.
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?
గిన్నెలపై మూత పెట్టండి : చాలా మంది వండేటప్పుడు వంట గిన్నెలపై మూత పెట్టరు. దాంతో కూరగాయలు ఉడకాలన్నా, అన్నం వండాలన్నా ఎక్కువ సమయం పడుతుంది. అదే వంట పాత్రలపై మూత పెడితే త్వరగా ఉడుకుతాయి. కావాలనుకుంటే మీరు ప్రెషర్ కుక్కర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా కొంతమేర గ్యాస్ ఆదా చేసుకోవచ్చు.
ఆ వస్తువులు కూల్ తగ్గాక ఉపయోగించాలి : మనకు ఉన్న మరో పెద్ద అలవాటు.. వంటకు కావాల్సిన సామాగ్రినంత ఫ్రిజ్‍లో పెట్టడం. ఈ విధంగా వంటకు కావాల్సిన వస్తువులు ఫ్రిజ్‍లో ఉంటే ముందుగా బయటకు తీయాలి. అవి పూర్తిగా కూల్ పోయిన తర్వాత మాత్రమే వంటకు ఉపయోగించాలి. ఎందుకంటే అవి కూల్‍గా ఉంటే.. వేడి అయ్యేందుకు టైమ్ తీసుకుంటుంది. ఇది కూడా గ్యాస్ అయిపోవడానికి ఓ కారణమే. అదే విధంగా వండడానికి ముందు బియ్యం, పప్పులు నానబెట్టాలి. ఎందుకంటే అలా నానబెట్టి వండితే అన్నీ చాలా త్వరగా ఉడుకుతాయి. ఫలితంగా కొంతమేర గ్యాస్ ఆదా అవుతుంది.
ఆ గిన్నెలను వాడండి : అలాగే మీరు ఉపయోగించే పాన్ కూడా గ్యాస్ ఆదా చేస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. అదేలాగంటే.. ఒకవేళ మీరు ఫ్లాట్‌గా పాన్ ఉపయోగిస్తే, గ్యాస్ సమానంగా వ్యాప్తి చెందుతుంది. అంతటా వేడి వ్యాపించి.. వంట ఈజీగా, త్వరగా ఉడుకుతుంది. అదే ఒకవేళ గుంటగా ఉన్న పాత్రలు అయితే దిగువ మాత్రమే వేడెక్కి.. కింద మాత్రమే ఎక్కవగా ఉడుకుతుంది. పైకి వచ్చేందుకు కాస్త టైమ్ పడుతుంది.
చూశారుగా ఈ టిప్స్.. మరి వీటిని పాటించి మీ వంట గ్యాస్ సేవ్ చేసుకోండి..