How To Reduce Credit Card Debt : చేతిలో డబ్బు లేకుండా ఏదైనా వస్తువు కొనాలంటే చాలా మందికి క్రెడిట్ కార్డే ఆప్షన్. ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం, మార్చి 2023 చివరి నాటికి క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ గత సంవత్సరంతో పోలిస్తే రూ. 4,072 కోట్లకు (1.94 శాతానికి) పెరిగింది. అయితే క్రెడిట్ కార్డ్ బకాయిలు సైతం పెరిగాయి. 2022 మార్చిలో ఇవి రూ. 1.64 లక్షల కోట్ల నుంచి.. 2023 మార్చిలో రూ. 2.10 లక్షల కోట్లకు పెరిగాయి. ఎలాగూ కార్డు ఉంది కదా, లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉందని.. ఇష్టానుసారంగా వాడితే చిక్కుల్లో పడతారు. క్రెడిట్ కార్డుపై ఎక్కువ రుణం తీసుకుని.. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఒక పద్ధతి ఉంది. అదే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ పద్ధతి.
ఇంతకీ ఎంటీ ఈ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ పద్ధతి?
What Is Credit Card Balance Transfer : క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ రుణాన్ని వడ్డీ రేటు తక్కువగా ఉన్న మరొక క్రెడిట్ కార్డ్‌కు బదిలీ చేయడం. బ్యాలెన్స్ బదిలీలు ఒకే బ్యాంకులో కాకుండా వివిధ బ్యాంకుల మధ్య కూడా చేయవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ రుణ భారాన్ని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బకాయి ఉన్న కార్డ్ రుణంపై వడ్డీ రేట్లు 42 శాతానికి పెరుగుతాయి.
అయితే.. బ్యాలెన్స్‌ను బదిలీ చేసే సౌలభ్యం అన్ని బ్యాంకుల్లో లేదు. ఫెడరల్ బ్యాంక్, HSBC, PNB, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ మొదలైనవి ఈ ఆఫర్‌ను అందిస్తున్నాయి. బ్యాంకులు ఇప్పుడు బ్యాలెన్స్ బదిలీలో వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీకు బాగా సరిపోయే ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. సున్నా వడ్డీతో 30- 45 రోజులలోపు చెల్లించే ప్లాన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై EMIని అందజేస్తున్నాయి. పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాన్ని కొంత వ్యవధిలో తీర్చడానికి అనుమతిస్తాయి.
ఈ బ్యాలెన్స్ బదిలీ ఎలా చేయాలి ?
How To Transfer Credit Card Balance : నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT) లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా నిధుల పంపిణీ జరుగుతుంది. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ బదిలీ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు.. నిబంధనలను అంగీకరించాలి. దీనికి ఫీజు ఉంటుందని గుర్తుంచుకోండి. దీంతో పాటు మీ క్రెడిట్ పరిమితి, క్రెడిట్ కార్డ్ గడువు తేదీ, బకాయి ఉన్న క్రెడిట్ మొత్తం, కార్డు నంబరు, గత 3-6 క్రెడిట్ కార్డ్ బిల్లు స్టేట్‌మెంట్‌లు, అడ్రస్ ప్రూఫ్, క్రెడిట్ కార్డ్ ఫొటోకాపీ మొదలైనవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో నిబంధనలు జాగ్రత్తగా చదవడం ముఖ్యం.
ఇది గుర్తుంచుకోండి..
అయితే బ్యాలెన్స్ బదిలీ కోసం కొత్త క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై తాత్కాలిక ప్రభావం పడుతుంది. మీరు ఇప్పుడు చెల్లించే వడ్డీ మీ కొత్త క్రెడిట్ కార్డ్ ద్వారా నిర్ణయిస్తారు. అధిక వడ్డీ రేట్లను నివారించడానికి కొత్త క్రెడిట్ కార్డులో రుణం నిర్ణీత సమయంలో చెల్లించడం చాలా కీలకం. బ్యాలెన్స్ బదిలీని ప్రారంభించడానికి చివరి రోజు కోసం వేచి ఉండకూడదు. గడువు తేదీకి కనీసం 4-5 రోజుల ముందే బదిలీ చేస్తే ఉత్తమం. ఆలస్యమైతే జరిమానా విధించే అవకాశముంది. దాన్ని కార్డ్ హోల్డరే భరించాల్సి ఉంటుంది.