సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి నెలలో చాలా మంది ఉద్యోగులకు వేతనాలు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగిన మొత్తం ఒక నెల తరువాత లేదంటే రెండో నెలలో చేతికి అందుతుంది. దీన్ని కొంత మంది బోనస్‌ల రూపంలోను అందుకుంటారు. అయితే ఆదాయం పెరిగిన సమయంలో ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అంతగా ప్రాధాన్యం లేని అంశాల కోసం డబ్బులు వృథా చేసుకోకుడదు. జీవితంలోని ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా పెట్టుబడులు పెట్టాలి. అందుకోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం.
జీతం పెరిగినప్పుడు చాలా మంది ఉద్యోగులు అందుకు అనుగుణంగా కొన్ని ఖర్చులను సిద్ధం చేసుకుంటారు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలనుకున్నప్పుడు ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదు.
అత్యవసర నిధిని పెంచుకునేలా..
మీ ఇంటి ఖర్చుల గురించి ఒకసారి పూర్తిగా అర్థం చేసుకోండి. కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల ఖర్చులకు సరిపోయేంత నిధిని మీ దగ్గర ఉందా అనేది చూసుకోండి. ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు మీకు వచ్చిన బోనస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది సైతం ముఖ్యమైన అంశమే. అంకురాలు, మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉన్న రంగాల్లో పనిచేస్తున్న వారు.. కనీసం సంవత్సరానికి సరిపడా ఖర్చులను సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ మొత్తాన్ని జమ చేసినప్పటికి.. సులభంగా డబ్బు వెనక్కి తీసుకునేలా ఉండాలి.
ధీమాగా ఉండేలా..
health insurance for salaried employees : ఇప్పటి వరకు మీకు బృంద ఆరోగ్య బీమా పాలసీ మాత్రమే ఉన్నట్లయితే.. సొంతంగా ఒక పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షల రూపాయల లోపు ఆరోగ్య బీమా పాలసీలను కూడా చాలా తక్కువ కిందే చెప్పుకోవచ్చు. కనీసం 30లక్షల రూపాయలు విలువ చేసే హెల్త్ ఇన్స్‌రెన్స్ పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నించండి. ప్రీమియం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. అవసరమైన సమయాలలో మీ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఆదాయం ఉందన్న కారణంతో ఇప్పటి వరకు కూడా ఎటువంటి పాలసీలను తీసుకోకపోతే.. ఇప్పుడైనా దాన్ని పరిశీలించండి. టాపప్‌తోనైనా సరే పాలసీని పెంచుకునే ప్రయత్నాలు చేయండి.
ఇంటి రుణం తీరేలా..
home loan repayment tips : ఇప్పటికే పై రెండు మార్గాలు పూర్తి చేసిన వారు.. ఇంటి అప్పును తీర్చేందుకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇప్పుడు గృహరుణం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అవి 8.5 శాతం నుంచి 9 శాతం వరకు పెరిగాయి. దీంతో అప్పు తీరేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర అవసరానికి మించి డబ్బు ఉన్నట్లయితే.. ఈఎంఐ మొత్తాన్ని పెంచుకునే అంశాన్ని పరిశీలించండి. దీని వల్ల వడ్డీ భారం, కాల వ్యవధి తగ్గుతుంది. ఇప్పటికే అప్పు ఉన్న రుణ గ్రహీతలు వివిధ బ్యాంకులు అందిస్తున్న హోమ్ సేవర్, హోమ్‌లోన్ అడ్వాంటేజ్, మాక్స్‌గెయిన్, హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ సేవర్ మొదలైన పేర్లతో అందిస్తున్న అకౌంట్లను ప్రారంభించవచ్చు. హోమ్‌లోన్ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు. దీన్ని రుణ ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా వడ్డీ భారాన్ని కొంత మేరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రుణగ్రహీత తన దగ్గరున్న మొత్తాన్ని రుణం చెల్లించకుండానే.. ముందస్తుగా చెల్లింపు చేసి ప్రయోజనం పొందేందుకు ఉపయోగపడుతుంది.
దీర్ఘకాలిక పెట్టుబడి కోసం..
investment plans for long term : ఈ నెల నుంచి మీరు పొందుతున్న అధిక సొమ్ములో కొంత మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడుల కోసం కేటాయించండి. దీర్ఘకాలిక దృష్టితో ఈ పెట్టుబడులు ఉండేలా చూసుకోండి. మ్యూచువల్ ఫండ్లలో లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లను పరిశీలించండి. ఇండెక్స్ ఫండ్‌లలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. మార్కెట్ పరిస్థితులను ఆధారంగా.. ఎలాంటి నియంత్రణ పరిమితులు లేకుండా మార్కెట్ క్యాప్స్, సెక్టార్, థీమ్‌లోల పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు ఇస్తాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో..
fd investment for salaried employees : దీర్ఘకాలంలో సంపద పెరగాలనుకునే.. ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది. కానీ నాలుగేళ్ల లోపు మాత్రమే అవసరాలు ఉన్న వారు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఏమాత్రం నష్టభయం భరించలేని వారికీ ఇవే సరైన పెట్టుబడులుగా చెప్పవచ్చు. ప్రస్తుతం డిపాజిట్ రేట్లు కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లకు గతంలో ఉన్న ద్రవ్యోల్బణ సూచీ సర్దుబాటు ప్రయోజనం.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దూరం అయ్యింది. ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్ల మధ్య సమానత్వం వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఎఫ్డీలపై 7.5 శాతం వరకు రాబడిని ఇస్తున్నాయి. అందువల్ల స్వల్పకాలంలో కారు, ఇల్లు కొనడం, వివాహం, పిల్లల చదువుల ఖర్చులాంటివి సమయంలో వీటిని ఎంచుకోవడమే శ్రేయస్కరంగా చెప్పవచ్చు. మంచి వడ్డీ అందిస్తున్న రెండు మూడు బ్యాంకులను ఎంచుకొని, వివిధ వ్యవధులకు డిపాజిట్ చేయండి.
మీ నష్టభయం భరించే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి స్కీంలను ఎంచుకోవాలి. వైవిధ్యమైన పెట్టుబడులతో డబ్బు మీ కోసం కష్టపడే విధంగా చూసుకోండి.