Invest in Foreign Stocks : దేశీయంగా ఉన్న స్టాక్ మార్కెట్‌కే పరిమితం కాకుండా.. విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని కొందరు అనుకుంటారు. విదేశాల్లోని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఇండియన్ ఎక్స్ఛేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్స్(IECR) పర్యవేక్షిస్తుంది. గతేడాది ఆగస్టు 22న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం.. విదేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల గురించి కొత్త విధానాలు రూపల్పన చేసింది.
Foreign Stock Investment From India : ఆ విధానాల ప్రకారం.. ఇండియాలో ఉండే ఎవరైనా ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఓఎఫ్‌డీ) లేదా ఓవర్సీర్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్మెంట్ (ఓపీఐ) విధానాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు భారతీయులు కచ్చితంగా Liberalized Remittance Scheme (LRS) నిబంధనలకు లోబడాలి. దీని ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ -మార్చి) గరిష్ఠంగా 2,50,000 డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఓఎఫ్‌డీ, ఓపీఐ రెండింటికీ ఇదే వర్తిస్తుంది.
Indian Overseas Investment Rules : ఓవర్సీస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైన కంపెనీల్లో మాత్రమే షేర్లు కొనాలి. అవి కూడా 10 శాతం లోపే. పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థపై నియంత్రణ ఉండకూడదు. ఉదాహరణకు అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, టెస్లా తదితర కంపెనీల్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్లు కొనవచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్రోకర్‌తో టైఅప్ అయిన ఇండియన్ బ్రోకర్ సంస్థను సంప్రదించి ఓవర్సీస్ ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. లేదా ఇండియాలో ఉన్న చార్లెస్ స్క్వాబ్, అమెరిట్రేడ్, ఇంటెరాక్టివ్ బ్రోకర్స్ లాంటి విదేశీ బ్రోకర్లను సంప్రదించి ఖాతా తెరవచ్చు.
స్టాక్స్‌లో మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. నాస్డాక్ లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ట్రేడ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులోనూ Liberalized Remittance Scheme (LRS) నిబంధనలు అనుసరించాలి. భారత పౌరులు ఇక్కడ నివసిస్తున్న వ్యక్తి నుంచి లేదా విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి నుంచి వారసత్వం ద్వారా విదేశీ సెక్యూరిటీల వాటాలు పొందవచ్చు.
అంతేకాకుండా బంధువుల నుంచి బహుమతుల రూపంలోనూ వాటా పొందొచ్చు. అయితే.. ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం - 2010 నిబంధనలకు లోబడి ఉండాలి. విదేశీ సంస్థలు జారీ చేసిన స్వెట్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎంప్లాయి స్టాక్ ఓనరషిప్ ప్లాన్ ద్వారా షేర్లు కొనుగోలు చేయవచ్చు. విదేశీ కంపెనీలో పనిచేస్తున్న భారతీయుడికి మినిమమ్ క్వాలిఫికేషన్ ఉన్నా 10 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
నియమ నిబంధనలు..
- ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్స్ : సంబంధిత బ్యాంకు వివరాలు సమర్పించాలి.
- ఆదాయపు పన్ను చట్టం : ఐటీ యాక్ట్ ప్రకారం.. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సమర్పించాలి. లేదంటే ముందుగా నోటీసులు జారీ చేసి తర్వాత ఐటీ యాక్ట్, 139 (9) సెక్షన్ ప్రకారం.. వాటిని అక్రమంగా పరిగణిస్తారు.
- Tax Collected Source (TCS) : ఎల్ఆర్ఎస్ కింద విదేశాల నుంచి పంపే నిధులు రూ.7 లక్షలు దాటితే టీసీఎస్ రూపంలో 5 శాతం పన్ను చెల్లించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు చెల్లిస్తే.. అదనంగా రూ.65 వేలు కట్టాల్సి ఉంటుంది.
లాభనష్టాలు..
- ప్రపంచవ్యాప్తంగా కీలక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందవచ్చు.
- నష్టపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. వివిధ దేశాల్లో రకరకాల కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే రిస్కు తక్కువ. ఎందుకంటే ఒక దేశంలో కరెన్సీ బలహీనపడినా.. మరో దేశంలో బలంగా ఉంటే సమతుల్యం ఉంటుంది.
- యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ , టెస్లా వంటి ఇంటర్నేషనల్ కంపెనీల్లో వాటా కలిగి ఉండవచ్చు.
- పెట్టుబడి పెట్టాలనుకునే కంపెనీలు, ఆయా దేశాల స్టాక్ మార్కెట్ల గురించి అవగాహన లేకపోవడం ప్రతికూలత.