How To Close Savings Bank Account : సేవింగ్స్ పై తక్కువ వడ్డీ రేట్లు, సంతృప్తికరంగా లేని కస్టమర్ సేవలు, ఆర్థిక లావాదేవీలపై అధిక రుసుము వసూలు చేయటం.. ఇలాంటి వివిధ కారణాలతో సేవింగ్స్ ఖాతాను మూసివేయడానికి కొందరు చూస్తుంటారు. ఇలాంటి వాటిపై చాలా మందికి అనుమానాలుంటాయి. తరచూ ఉద్యోగాలు మారేవారు.. ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు.. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారు. మీరు సేవింగ్స్ అకౌంట్‌ను మూసివేయాలనుకుంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
సేవింగ్స్ ఖాతా క్లోజ్ చేసే ముందు ఇవి తప్పక చేయండి..
1. మీరు ఆన్‌లైన్‌లో సేవింగ్స్ ఖాతాను క్లోజ్ చేయలేరు. కాబట్టి తప్పని సరిగా మీకు దగ్గరలోని సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లండి.
2. మీరు మూసేయాలనుకుంటున్న సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసిన డెబిడ్ ఆదేశాలను వేరొక అకౌంట్‌కు బదిలీ చేయండి.
3. మీ EMI, చెల్లింపు బిల్లులు, నెలవారీ సబ్‌స్క్రిప్షన్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP), ఆటోమేటెడ్ క్లియరెన్స్ వంటి వాటిని.. ముందుగానే మరొక ఖాతాకు బదిలీ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉంటుంది.
4. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు లాకర్ అద్దె చెల్లింపులు లింక్ చేసి ఉంటే.. రాబోయే అద్దె చెల్లింపుల కోసం వేరొక ఖాతాను జోడించండి. ఇలా చేస్తే మీరు సేవింగ్స్ అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి బ్యాంకు అనుమతిస్తుంది.
5. మీరు వినియోగించని సేవింగ్స్ అకౌంట్‌లను క్లోజ్ చేయవచ్చు. కానీ, కొత్త ఖాతాలను బ్యాంకు నిర్దేశించిన గడువు కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే రూ.500 వరకు జరిమానా చెల్లించాలి.
6. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), బీమా పాలసీలు వంటి వివిధ ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవారు లింక్ చేసిన పాత ఖాతాను మూసివేసినప్పుడు కొత్త ఖాతా వివరాలను అందించాలి.
7. ఖాతాలో పెండింగ్ లావాదేవీలు ఉన్నాయో లేదో ముందుగా తనిఖీ చేసుకోవాలి. అకౌంట్‌లలో డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్కుల లావాదేవీలు పెండింగ్‌లో ఉంటే.. ముందుగా వాటిని పూర్తి చేసుకోవాలి. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ నిల్వలను పాటించకపోతే విధించే.. నెగెటివ్ బ్యాలెన్స్ సొమ్మును చెల్లించాలి.
8. మీది జాయింట్ సేవింగ్స్ అకౌంట్ అయితే.. ఖాతాదారులు ఇద్దరు తప్పనిసరిగా హాజరు కావాలి. కానీ, కొన్ని బ్యాంకులు ఒక భాగస్వామి లేకపోతే 'ో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) ను సమర్పించమని కోరతాయి.
9. సేవింగ్స్ అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి పత్రాలను బ్యాంకుకు తీసుకొని వెళ్లండి.
10. ఒకవేళ మీ ఖాతా చాలా కాలంగా పని చేయకపోతే.. దానిని యాక్టివేట్ చేసిన తరువాత క్లోజ్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.
Savings And Current Accounts Difference : సేవింగ్స్.. కరెంట్.. రెండు అకౌంట్లలో ఏది బెస్ట్?