Health Insurance Tips : ఆరోగ్య బీమా అత్యవసర వైద్య పరిస్థితుల్లో మనల్ని, మన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. అయితే మార్కెట్లో వ్యక్తిగత ఆరోగ్య బీమా కల్పించే పాలసీలు చాలా ఉన్నాయి. అలాగే కుటుంబం మొత్తానికి కవరేజీ ఇచ్చే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ కూడా ఉన్నాయి.
అవసరాలకు అనుగుణంగా హెల్త్ పాలసీలు
- Individual Health Insurance : వ్యక్తిగత ఆరోగ్య బీమా కేవలం ఆ పర్టిక్యులర్ వ్యక్తికి మాత్రమే కవరేజీని ఇస్తుంది. ఒక వేళ అతనికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, చికిత్సకు అయ్యే ఖర్చులు ఈ బీమా కవరేజ్ ద్వారా పొందడానికి వీలవుతుంది. కానీ ఇది ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి ఏ విధంగానూ కవరేజ్ కల్పించదు. అందువల్ల పాలసీదారునికి ఆరోగ్య సమస్యలు, ప్రత్యేక అవసరాలు ఉంటే.. దానికి అనుగుణంగా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదే.
- Family Floater Insurance : ఫ్యామిలో ఫ్లోటర్‌లో కుటుంబ సభ్యులు అందరూ సభ్యులుగా ఉంటారు. అంటే ఒకే పాలసీ కుటుంబం మొత్తానికి కవరేజ్‌ను అందిస్తుంది. ఇది కష్టసమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బీమా కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో నిర్దిష్ట మొత్తం మాత్రమే ఇస్తుంది. ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు బీమా కవరేజీలో కొంత మొత్తం ఖర్చు అయిపోతే.. మిగతా కవరేజీ సొమ్ము తగ్గిపోతుంది. అందువల్ల ఇతర కుటుంబ సభ్యులకు బీమా రక్షణ తగినంత ఉండకపోవచ్చు.
- Multi Individual Health Insurance : బహుళ వ్యక్తిగత ఆరోగ్య బీమా (మల్టీ ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్) ప్రీమియం ఖర్చులపై రాయితీ లభిస్తుంది. దీనిలో ప్రతి వ్యక్తికీ వారి సొంత పాలసీ ఉంటుంది. కనుక ఎవరికి వారినే ప్రత్యేకంగా చూస్తారు. ముఖ్యంగా చిన్న వయస్సు వారికి, మంచి ఆరోగ్యంతో ఉన్నవారికి ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో మంచిగా ఉపయోగపడుతుంది.
ఏది బెటర్ పాలసీ?
Family Floater vs Individual Health insurance : ఆరోగ్య బీమా పాలసీల్లో ఏది కొనుగోలు చేయాలన్న నిర్ణయం.. ఆయా వ్యక్తుల, కుటుంబాల అవసరాలకు అనుగుణంగా మారుతుంది. మల్టీ ఇండివిడ్యువల్ హెల్త్ కవర్, ఫ్యామిలీ ఫ్లోటర్స్ మధ్య ఏది తీసుకోవాలన్నది.. ఆ కుటుంబ అవసరాలను అనుసరించి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు అనేది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే విషయంలో కీలకంగా ఉంటుంది. పెద్ద కుటుంబానికి ఫ్యామిలీ ఫ్లోటర్ కవర్ చాలా ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. కానీ తక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే మాత్రం ఫ్యామిలీ ఫ్లోటర్ మంచి ఆప్షన్ అవుతుంది. కొన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో కుటుంబ సభ్యుల సంఖ్యపై పరిమితి కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏ తరహా పాలసీ మీకు అనుగుణంగా ఉంటుందో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
భిన్న ప్రయోజనాలు
How to pick the best health insurance policy : వివిధ ఆరోగ్య బీమా పాలసీలు భిన్నమైన ప్రయోజనాలతో కూడుకొని ఉంటాయి. కనుక పాలసీలను కొనుగోలు చేసే సమయంలోనే వాటి గురించి క్లియర్‌గా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ వైద్య అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవాలి. ఈ క్రమంలో వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ల పాలసీల్లో ఏది మీకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందో మీరే నిర్ణయించుకోవాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Health insurance tips and tricks : ఆరోగ్య బీమా తీసుకున్న సమయంలోనే ప్రీమియం, మినహాయింపులు, సహ చెల్లింపులు, ఇతర రుసుములు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీర్ఘకాలంలో ఏ పాలసీ మీకు రక్షణ ఇస్తుందో దానినే ఎంచుకోవాలి.
నోట్ : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేముందు కచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. కచ్చితంగా మీ ఆర్థిక సలహాదారుతో దీనిని గురించి చర్చించండి. లేదా ఆరోగ్య బీమా ఏజెంట్ లేదా నిపుణులతో మాట్లాడండి. అలాగే మీరు ఆయా పాలసీల గురించి బీమా సంస్థల వెబ్సైట్ లేదా సహాయ కేంద్రాల ద్వారా తెలుసుకోండి. ఇది మీకు ఏ పాలసీ సరిపోతుందన్న విషయంలో మంచి మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది.