Health Insurance Policy: ఆరోగ్యంగా ఉన్నాం.. మనకు వైద్య బీమా పాలసీతో పనేమిటి? అని చాలామంది భావిస్తుంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి. ఒక్కసారి అనారోగ్యం బారిన పడిన తర్వాత ఈ పాలసీ తీసుకోవాలన్నా కష్టంగా మారుతుంది. నిబంధనలు, మినహాయింపులు పెరిగిపోతాయి. ప్రీమియం పెరిగే అవకాశాలూ లేకపోలేదు.
⦁ ఆరోగ్య బీమా అంటే.. కేవలం అనారోగ్యం వచ్చినప్పుడే ఉపయోగపడుతుంది అనుకోవద్దు. అనుకోని ప్రమాదాల బారిన పడ్డప్పుడూ ఇది ఉపయోగపడుతుందని గుర్తించాలి.
⦁ పాలసీ చిన్న వయసులోనే తీసుకోవడం అనేది తప్పనిసరి కాదు. ఆసుపత్రిలో చేరకపోతే ప్రీమియం దండగ అనే భావన చాలామందిలో ఉంటుంది. బీమా రక్షణ ఉండాలి. అంతేకానీ, దాన్ని క్లెయిం చేసుకునే పరిస్థితి రాకూడదు. క్రమం తప్పకుండా పునరుద్ధరణ చేస్తూ వేళ్తే.. అనుకోకుండా క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బీమా సంస్థలు పరిహారం చెల్లిస్తాయి.
⦁ తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించేవి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఇక్కడ ఇవే మంచివి. కానీ, ఈ సూత్రాన్ని ఆరోగ్య బీమా పాలసీలకు అన్వయించలేం. ప్రీమియం ఆధారంగా ఏ రెండు సంస్థల ఆరోగ్య బీమా పాలసీలనూ పోల్చడం సాధ్యం కాదు. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది.. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆ పాలసీ ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తుందనేది. తక్కువ ప్రీమియం ఉండే పాలసీల్లో సహ చెల్లింపు, మినహాయింపులు, ఉప పరిమితులు ఉంటాయి. ఫలితంగా ఆసుపత్రిలో చేరినప్పుడు చేతి నుంచి కొంత మొత్తం భరించాల్సి వస్తుంది. ఇది అదనపు భారమే.
⦁ చాలామంది యాజమాన్యం అందించే బృంద బీమా పాలసీ ఉండగా, సొంతంగా మరో పాలసీ ఎందుకు తీసుకోవాలి అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు. బృంద బీమా పాలసీలు మంచివే. ఇందులో తల్లిదండ్రులకూ రక్షణ కల్పిస్తారు. కొన్నిసార్లు కొంత ప్రీమియాన్ని భరించాల్సి వచ్చినా ఈ పాలసీలను తీసుకోవాలి. ఈ పాలసీల్లో వేచి ఉండే వ్యవధి, ముందస్తు వ్యాధుల్లాంటివి ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడే బీమా రక్షణ ఉంటుంది. కాబట్టి, తరచూ ఉద్యోగాలు మారేవారు.. సొంతంగా పాలసీ తీసుకోవడమే మంచిది.
⦁ ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలసీ రక్షణ ప్రారంభం అవుతుంది. కానీ, కొన్ని చికిత్సలకు 30 రోజుల వరకూ పరిహారం ఇవ్వవు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇలాంటి నిబంధన వర్తించదు. కొన్ని వ్యాధుల చికిత్సకు ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వరకూ క్లెయిం చేసుకోవడం సాధ్యం కాదు. సాధారణంగా నాలుగేళ్ల తర్వాతే అన్ని ముందస్తు వ్యాధుల చికిత్సకూ పాలసీ రక్షణ కల్పిస్తుంది.
⦁ ఆరోగ్య బీమా పాలసీలకూ, క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలకూ మధ్య తేడా ఉంది. ఆరోగ్య బీమా పాలసీ ఆసుపత్రిలో చేరి, చికిత్స చేసుకున్నప్పుడు ఆ ఖర్చును భరిస్తుంది. క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ.. నిర్ణీత వ్యాధి బారిన పడినప్పుడు చికిత్స వ్యయంతో సంబంధం లేకుండా.. పాలసీ మొత్తాన్ని చెల్లిస్తుంది. సాధారణంగా ఇది 8 నుంచి 20 అనారోగ్యాలకు వర్తిస్తుంది. ఇప్పుడు వస్తున్న కొన్ని పాలసీలు 60 రకాల తీవ్ర వ్యాధులకు పరిహారం ఇస్తున్నాయి. క్యాన్సర్, గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, అవయవ మార్పిడి, పక్షవాతం ఇలా అనేక రకాల వ్యాధులకు ఇది వర్తిస్తుంది. కనీసం రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ. కోటి వరకూ పరిహారం ఇచ్చే పాలసీలున్నాయి. కొత్తగా పాలసీ తీసుకున్నప్పుడు ఏదైనా వ్యాధి బయటపడిన తర్వాత కనీసం 30-90 రోజులు జీవించి ఉంటేనే పరిహారం ఇచ్చే నిబంధన ఉంటుంది. ఈ పాలసీని తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు.
⦁ పాలసీని తీసుకునేటప్పుడు నిబంధనలు, మినహాయింపులు ఒకటికి రెండుసార్లు చదవండి. అర్థం కాకపోతే నిపుణుల సలహా తీసుకోండి. మీ కుటుంబ వైద్యుడి సలహాను తీసుకోవడమూ మంచిదే.