Gautam Adani Overtakes Mukesh Ambani As India's Richest Man : అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ భారత దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి, ఆయన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలు ఆర్జించడమే ఇందుకు కారణం.
బ్లూమ్‌బర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ 97.6 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే 12వ అత్యంత ఐశ్వర్యవంతుడిగా, భారత్‌లో నంబర్ 1 ధనవంతుడిగా నిలిచారు.
జెట్ స్పీడ్‌తో
అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 3వ స్థానానికి ఎగబాకి, అంతే వేగంగా కిందకు దిగివచ్చారు. మళ్లీ అత్యంత వేగంగా పుంజుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో భారత్‌లోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ నంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. అంతేకాదు ఆసియాలనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలోని 12వ ఐశ్వర్యవంతునిగా నిలిచారు.
రెండో స్థానానికి ముకేశ్
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 97 బిలియన్ డాలర్లుగా ఉంది. కొంచెం సంపద తేడాతో ఆయన రెండో స్థానానికి చేరారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు.
ఎదుగుతూ ఉన్నారు!
గతేడాది నుంచి అదానీ, అంబానీ ఇద్దరూ వరల్డ్ రిచెస్ట్ లిస్ట్‌లో తమ స్థానాలను మెరుగుపరుచుకుంటున్నారు. 2023లో గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 15వ స్థానంలో ఉంటే, ముకేశ్ అంబానీ 14వ స్థానంలో ఉండేవారు. కానీ నేడు వారు వరుసగా 12, 13 స్థానాలకు ఎగబాకారు.
ఆరోపణలు ఉన్నప్పటికీ
2023 జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక గౌతమ్ అదానీ సంస్థలపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్లలో అవకతవకలు చేశారంటూ ఆరోపించింది. దీనితో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అదానీ వ్యక్తిగత సంపద అయితే ఏకంగా 60 శాతం మేరకు పడిపోయింది. కానీ కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు, విదేశీ సంస్థల ఆరోపణలు, మీడియాలో వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంది. దీనితో అదానీ గ్రూప్ కంపెనీలకు మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ రాణిస్తున్నాయి.