Jack Dorsey Steps Down Twitter: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే.. ఆ సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారు. ట్విట్టర్ బోర్డు నుంచి డోర్సే వైదొలిగారు. బుధవారం కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లుగా పదవీకాలం ముగిసిన కొందరిని తిరిగి ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి. డోర్సే పదవీకాలం కూడా ముగిసినప్పటికీ.. ఆయన రీ ఎలక్షన్‌కు నిలబడలేదు. దీంతో ఆయన కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగినట్లయింది.
2006లో డోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విట్టర్‌ను స్థాపించారు. 2007 నుంచి ఆయన కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. 2015లో ట్విట్టర్ సీఈఓగా నియమితులయ్యారు. అయితే అనూహ్యంగా గతేడాది నవంబరులో సీఈఓ పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత బోర్డు నుంచి కూడా వైదొలుగుతానని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పుడు ఆయన బోర్డును వీడారు. డోర్సే నిర్ణయంతో.. ట్విట్టర్ బోర్డు చరిత్రలో తొలిసారిగా కంపెనీ వ్యవస్థాపకులెవరూ సంస్థలో పనిచేయడం గానీ, బోర్డు సభ్యులుగా గానీ లేకపోవడం గమనార్హం.
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో ట్విట్టర్‌పై మస్క్ అభిప్రాయాలను డోర్సే ఏకీభవిస్తూ వచ్చారు. దీంతో ఆయన తిరిగి కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలను డోర్సే కొట్టిపారేశారు. తాను తిరిగి ట్విట్టర్‌కు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆయన.. కంపెనీ సీఈఓగా ఎవరూ బాధ్యతలు చేపట్టబోరని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ చేసుకున్న ఒప్పందం ప్రస్తుతం నిలిచిపోయింది. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాల సంఖ్యపై సంస్థ స్పష్టత ఇస్తేనే ఈ ఒప్పందం ముందుకెళ్తుందని మస్క్ స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు కంపెనీ భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది.
దూసుకెళ్లిన ట్విట్టర్ షేరు: ఎలాన్ మస్క్ చేసిన ఓ ప్రకటనతో ట్విట్టర్ షేరు దూసుకెళ్లింది. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 5 శాతానికిపైగా పెరిగిన సూచీ చివరకు దాదాపు 4 శాతం లాభంతో 37.16 డాలర్ల వద్ద సెషన్‌ను ముగించింది. ట్విట్టర్ ఒప్పందం కోసం నిధులు సమకూర్చుకునేందుకు.. తన సొంత సంపదలో మరో 6.25 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు మస్క్. దీంతో ట్విట్టర్ షేరు పుంజుకుంది.
రూ.11వేల కోట్ల ఫైన్: ట్విట్టర్‌కు 150 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 11 వేలకోట్లకుపైనే) జరిమానా పడింది. 2013 మే నుంచి 2019 సెప్టెంబర్ మధ్యలో యూజర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర సమాచారాన్ని ప్రకటనదారులకు ఇచ్చిందనే ఆరోపణలపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సంయుక్త విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. వినియోగదారుల డేటాను కాపాడటంలో సామాజిక మాధ్యమం విఫలమైందని నిర్ధరించాయి. దీంతో భారీ ఫైన్ విధించింది.
ఇవీ చూడండి: వంటగదికి తీపి కబురు.. వంటనూనెల దిగుమతులపై సుంకాల తొలగింపు!
గ్రెటా ఎలక్ట్రిక్ కొత్త విద్యుత్ స్కూటర్.. విడిగానే బ్యాటరీ, ఛార్జర్!