Flipkart Price Lock Feature : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ త్వరలోనే 'ప్రైస్ లాక్' ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదే కనుక అందుబాటులోకి వస్తే.. కస్టమర్లు తమకు నచ్చిన వస్తువు (ప్రొడక్ట్)ను ముందే రిజర్వ్ చేసుకుని.. అత్యంత చౌక ధరకే కొనుగోలు చేసుకోవడానికి వీలవుతుంది.
'ప్రైస్ లాక్' అంటే?
భారత్లో త్వరలోనే పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ ప్లాట్ఫాం ఫ్లిప్కార్ట్ 'ప్రైస్ లాక్' ఫీచర్ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, కస్టమర్లు తమకు నచ్చిన వస్తువును రిజర్వ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఇందుకోసం ఒక నిర్దిష్టమైన చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సదరు వస్తువును ముందే నిర్ణయించిన ధరకు, కచ్చితంగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.
కస్టమర్ల కోసమే..
సాధారణంగా పండుగ సీజన్లో.. స్పెషల్ సేల్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే బెస్ట్ ప్రొడక్టులు అన్నీ అమ్ముడైపోతూ ఉంటాయి. కనుక చాలా మంది తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని నివారించడానికే ఫ్లిప్కార్ట్ ఈ నయా ఫీచర్ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.
"మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం, పండుగ సీజన్లో సేల్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే.. చాలా ఉత్పత్తులు పూర్తిగా అమ్ముడైపోతాయి. దీనివల్ల సదరు వస్తువులను కోరుకునే చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ ప్రైస్ లాక్ ఫీచర్తో కస్టమర్లు తమకు నచ్చిన ప్రొడక్టును ముందే రిజర్వ్ చేసుకోగలుగుతారు. అలాగే ముందే నిర్ణయించిన స్థిరమైన ధరకు కొనుగోలు చేయగలుగుతారు." అని ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీపీటీవో) జె.వేణుగోపాల్ తెలిపారు.
ధరలు పెరిగినా భయం లేదు!
ఈ ప్రైస్ లాక్ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే.. కస్టమర్లకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఎలా అంటే.. సాధారణంగా కొన్ని ప్రొడక్టుల ధరలు అమాంతంగా పెరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ముందే నిర్ణయించుకున్న బడ్జెట్లో వాటిని మనం కొనుగోలు చేయలేము. కానీ ప్రైస్ లాక్ ఫీచర్ వచ్చిన తరువాత.. కస్టమర్లు తాము రిజర్వ్ చేసుకున్న వస్తువులను.. ముందు నిర్ణయించుకున్న ధరల వద్దనే కొనుగోలు చేయడానికి వీలవుతుంది. అందువల్ల పెరిగిన ధరల భారం కస్టమర్లపై పడకుండా ఉంటుంది.
ఎప్పుడు వస్తుంది?
ఫ్లిప్కార్ట్ ఈ ప్రైస్ లాక్ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో కచ్చితంగా వివరించలేదు. అయితే పండుగ సీజన్లోనే తెచ్చే అవకాశం ఉండవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్
Flipkart Big Billion Days 2023 : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈ సెప్టెంబర్ 23 అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మెగా సేల్ అక్టోబర్ 1 వరకు అంటే వరుసగా 8 రోజులపాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా కస్టమర్లకు భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందించనుంది ఫ్లిప్కార్ట్.