Flight Ticket Price Rise : ప్రధాన మార్గాల్లో నిర్వహించే విమాన సర్వీసులకు విధిస్తున్న 'ప్రాంతీయ విమాన అనుసంధాన సుంకాన్ని' ప్రభుత్వం పెంచనుంది. ఇందువల్ల విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. చిన్న పట్టణాలకూ విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను 'ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం అయిన ఉడాన్' కింద ఇస్తున్నారు. ఉడాన్ విమానాల్లో దాదాపు సగం సీట్ల వరకు సబ్సిడీ ధర ఉంటుంది. ఈ సర్వీసులు నిర్వహించే సంస్థలకు నష్టం వస్తే, ఆదుకునే నిధిని ఏర్పాటు చేశారు. దీనికి నిధులు సమకూర్చేందుకు '2016 డిసెంబరు నుంచి ప్రధాన మార్గాల్లో నడిచే విమాన సర్వీసుల నుంచి లెవీని' పౌర విమానయాన శాఖ వసూలు చేస్తోంది.
ప్రస్తుతం ప్రధాన మార్గాల్లో ఒక విమానం బయలుదేరితే (డిపార్చర్) ఈ సుంకం కింద రూ.5,000 వసూలు చేస్తున్నారు. 2023 జనవరి 1 నుంచి ఈ సుంకాన్ని రూ.10,000కు; ఏప్రిల్ 1 నుంచి రూ.15,000కు పెంచనున్నారు. ఈ ఏడాది నవంబరు 1 వరకు 451 ఉడాన్ మార్గాలున్నాయి. రాబోయే నెలల్లో వీటి సంఖ్య పెరగనుంది. సుంకం పెరిగితే, ప్రధాన మర్గాల్లో ఒక్కో ప్రయాణికుడికి రూ.50 వరకు ఛార్జీ పెరిగే అవకాశం ఉందని విమానయాన అధికారి ఒకరు అంచనా వేశారు.