Financial Management Tips For Couple : వ్యక్తుల ఆర్థిక అవసరాలు, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఒక వేళ మీకు పెళ్లి అయితే, ఇద్దరూ కలిసి ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడం వల్ల అద్భుత ఫలితాలుంటాయి. ఇందుకోసం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తమ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం, సరైన ప్రణాళిక వేసుకోవాలి. అందుకు తగ్గట్లుగా ఇద్దరూ కలిసి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ చేయాలి. అప్పుడే వారికి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అందుకే ఈ ఆర్టికల్లో భార్యాభర్తలు కలిసి తమ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం పాటించాల్సిన 9 అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.
1. ఆర్థిక అంశాలపై చర్చ
ముందుగా మీరు చేయాల్సింది ఆర్థిక విషయాల గురించి చర్చించుకోవడం. ఇది అంత సులభం కాదు. కానీ, దంపతులు ఇద్దరూ మాట్లాడుకోవడం మాత్రం తప్పనిసరి. మీ ఆర్థిక లక్ష్యాలు, సవాళ్లు గురించి మీ భాగస్వామితో మాట్లాడాలి. మీ ఆర్థిక అలవాట్లు, పొదుపు, ఖర్చుల వివరాల గురించి కూడా మీ భాగస్వామితో చెప్పండి. మనీ మ్యాటర్ అనేది కొంచెం సున్నితమైన అంశం కావచ్చు. కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది హెల్దీ రిలేషన్షిప్నకు చాలా అవసరం. మీకు కొత్తగా వివాహమైనా లేదా పెళ్లై చాలా కాలమైనా, ఒక జంటగా మీరు వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం.
2. ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలు
జంటగా మీ ఆకాంక్షలను ప్రతిబింబించే, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోవాలి. అది సొంతిల్లు, పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇలా ఏదైనా కావచ్చు. కలిసి నిర్దేశించుకోవడం వల్ల ఒక పరస్పర అవగాహనతో మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
3. బడ్జెట్
పండుగలు, కుటుంబ బాధ్యతలు, ఇతర వేడుకల ఖర్చులను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ఒకవేళ మీకు ఆభరణాలపై ఇష్టం ఉంటే, వాటి కోసమూ కొంత సొమ్ము పొదుపు చేసుకోవాలి. ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, అప్పులు లాంటి అంశాల్లో స్పష్టమైన అవగాహన కలిగేందుకు బడ్జెట్ కచ్చితంగా ఉపయోగపడుతుంది.
4. ఆర్థిక నిర్వహణ
బంగారం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), బంగారం లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ వ్యయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాలి.
5. బాధ్యతలు పంచుకోవాలి
మీ బలాబలాలు, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. బిల్లు చెల్లింపులు, పెట్టుబడులు, పొదుపులు లాంటి బాధ్యతల్ని పంచుకోవాలి. వాటిని ఎవరు నిర్వహిస్తారని ఒక పరస్పర అంగీకారానికి రావాలి. దీని వల్ల భవిష్యత్తులో ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయి.
6. బ్యాంకు ఖాతాల నిర్వహణ
ఇంటికి సంబంధించిన ఖర్చులు, ఉమ్మడి లక్ష్యాలకు సంబంధించి జాయింట్ అకౌంట్ మెయింటెన్ చేయాలి. అలాగే వ్యక్తిగత ఖర్చుల కోసం వ్యక్తిగత ఖాతాలు కూడా నిర్వహించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక విషయాలలో పారదర్శకత ఉంటుంది.
7. అత్యవసర నిధి
అత్యవసర పరిస్థితులు చెప్పిరావు. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని అత్యవసర సమయాల్లో కాపాడుతుంది. ఇందులో ఇద్దరి భాగస్వామ్యం ఉండాలి. దీనికోసం ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా షార్ట్-టర్మ్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి.
8. ఖర్చులు
హోమ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బిల్లులు తదితర రుణాలు ఉన్నప్పుడు, అధిక వడ్డీ ఉండే రుణాలను ముందుగా తీర్చే ప్రయత్నం చేయాలి. ఒక పక్కా వ్యూహంతో రుణాలను వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేయాలి.
9. పెట్టుబడులు
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి అన్వేషించాలి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్, బంగారం, రియల్ ఎస్టేట్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి. అయితే నష్టాన్ని భరించే శక్తిని అనుసరించి, వీటిల్లో మీ పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే మీ భాగస్వామితో చర్చించిన తరువాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి.
దంపతులు ఇద్దరూ కలిసి పొదుపు చేయడమే కాదు. ఏదైనా విజయం సాధించినప్పుడు కచ్చితంగా ఇద్దరూ కలిసి సెలెబ్రేట్ చేసుకోవాలి. ఇలా ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల ఆర్థిక లక్ష్యాలను సులువుగా సాధించడానికి వీలవుతుంది.
మెటర్నిటీ బీమాతో ఆర్థిక రక్షణ- పాలసీ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి!
కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి తెలుసా? మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?