ఆర్థిక అత్యవసర పరిస్థితి మనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తగిన ఏర్పాట్లు లేకపోతే మన పొదుపు, పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు రాబడితోపాటు, అసలునూ నష్టపోయే ప్రమాదమూ ఉంది. కీలకమైన ఆర్థిక లక్ష్యాల సాధనకు అవాంతరాలు ఏర్పడవచ్చు. తగినంత అత్యవసర నిధిని ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవడమే సరైన ఆర్థిక ప్రణాళిక అనిపించుకుంటుంది. ఈ నిధిని సమర్థంగా నిర్వహించే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
ఏడాదికి సరిపోయేలా..
తగినంత అత్యవసర నిధిని జమ చేయడం ఎప్పుడూ మంచిదే. కనీసం 6 నెలల ఇంటి ఖర్చులు, రుణ వాయిదాలకు సరిపోయే మొత్తం అందుబాటులో ఉండాలి. మాంద్యం నీడలు కనిపిస్తున్న వేళ.. ఈ నిధిని 12 నెలలకు సరిపోయేలా ఉంచుకోవడం అవసరం. నిత్యావసరాలు, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, వాహనం ఖర్చులు, ఇతర బిల్లులు తదితర చెల్లింపులకు ఎంత మేరకు అవసరం అవుతోందనే లెక్కలు వేసుకొని, ఆ మేరకు నిధిని ఏర్పాటు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఈ నిధిని సమీక్షించుకోవడమూ అవసరమే. మారుతున్న జీవన శైలి, ఖర్చులకు తగ్గట్టుగా ఆ మొత్తం ఉందా లేదా చూసుకోండి.
సులభంగా వెనక్కి తీసుకునేలా..
అత్యవసర నిధి ఎప్పుడూ సులభంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్లు, అధిక వడ్డీ చెల్లించే పొదుపు ఖాతాల్లో ఈ నిధిని దాచుకోవాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వెంటనే డబ్బును తీసుకునేందుకు వీలుంటుంది. అదే సమయంలో కొంత రాబడిని ఆర్జించేందుకు వెసులుబాటు ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని ఎంతోకొంత తట్టుకునే శక్తి లభిస్తుంది. మారుతున్న మీ ఆర్థిక బాధ్యతల ఆధారంగా మీ అత్యవసర నిధి పరిమాణాన్ని సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు మీరు రుణం తీసుకుంటే.. వాయిదాల మొత్తానికి అనుగుణంగా నిధి ఉండాలి. రుణం చెల్లింపు పూర్తయిన తర్వాత ఈ నిధిని తగ్గించుకోవచ్చు. వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీల్లేని, లాకిన్ వ్యవధి ఉండే పథకాల్లో అత్యవసర నిధిని జమ చేయొద్దు.
ఎప్పుడు వాడాలి..
అత్యవసర పరిస్థితుల కోసం నిధిని ఏర్పాటు చేసుకున్నా, చివరి ప్రయత్నంగానే దీన్ని వినియోగించాలి. రోజువారీ ఆర్థిక అవసరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, ఏ ఇతర మార్గాలూ లేనప్పుడే దీన్ని ఉపయోగించాలి. మీ అత్యవసర నిధి శాశ్వత పరిష్కారం కాదు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వెసులుబాటు మాత్రమే. దీన్ని ఉపయోగించుకుంటున్న క్రమంలో అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇవ్వాలి. వృథా వ్యయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. పరిస్థితులు మెరుగయ్యాక వెంటనే ఈ నిధిని పూర్వ స్థితికి చేర్చాలి.
కుటుంబ అవసరాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, వ్యక్తిగత ఖర్చులు, రుణ వాయిదాల చెల్లింపు తదితరాల కోసమే ఈ నిధిని ఉపయోగించండి. జీవిత భాగస్వామికి, ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఈ వివరాలు చెప్పడం మర్చిపోవద్దు.
కరోనా మనకు ఎన్నో విలువైన ఆర్థిక పాఠాలు నేర్పింది. అత్యవసర పరిస్థితులు ఎప్పుడూ చిన్న హెచ్చరికతోనే ప్రారంభమవుతాయి. ఎప్పుడూ తగిన విధంగా సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని.