వేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ మార్కెట్‌లో తమ వాటాను గణనీయంగా పెంచుకోవాలని మారుతీ సుజుకీ ప్రయత్నిస్తోంది. ఈ విభాగంలో ప్రస్తుతం ఉన్న 14.5 శాతం మార్కెట్ వాటాను రెండేళ్లలో 27 శాతానికి చేర్చాలని లక్ష్యంగా విధించుకుంది. దీన్ని సాధించే దిశగా మార్చి నాటికి రెండు కొత్త మోడళ్లను తీసుకురావడంతో పాటు, మున్ముందు మరిన్ని మోడళ్లను విడుదల చేస్తామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు.
మొత్తం కార్ల విపణిలో తమకు 42% వాటా ఉందని, ఎస్‌యూవీల విక్రయాలు పెంచుకోవడం ద్వారా ఈ వాటాను 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఎస్‌యూవీలు కాకుండా చూస్తే మార్కెట్లో తమ వాటా 65% మేరకు ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలో మారుతీ సుజుకీ 3,500 (ఎరీనా, నెక్సా, కమర్షియల్ కలిపి) విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 200 విక్రయ కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 38% వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరం వాహన విక్రయాలకు బాగా కలిసొచ్చిందని శశాంక్ పేర్కొన్నారు. ఏప్రిల్-అక్టోబరు మధ్య కాలంలో పరిశ్రమలో మొత్తం 22.75 లక్షల కార్లు అమ్ముడయ్యాయని తెలిపారు. ఇందులో ఎస్‌యూవీలకు 42% వాటా ఉందన్నారు. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన మొత్తం వాహనాలు 16.4 లక్షలతో పోలిస్తే ఇప్పటికే 38 శాతం వృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. 2018-19లో 33.7 లక్షల కార్లు అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 38 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేశారు.ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మారుతీ సుజుకీ ఇటీవలే 10 లక్షల కార్ల మార్కును సాధించిందన్నారు. గతంతో పోలిస్తే 33% వృద్ధిని సాధించినట్లు వెల్లడించారు. మార్చి నాటికి 16 లక్షల కార్లను విక్రయించగలమని చెప్పారు. నాలుగేళ్ల క్రితం చిన్న కార్లు 15 లక్షలు అమ్ముడవగా, ఇప్పుడు వీటి సంఖ్య దాదాపు 11,60,000. ముఖ్యంగా వీటి ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఈ కార్లను కొనుగోలు చేసే వారి ఆదాయాలు ఆ స్థాయిలో పెరగకపోవడంతో విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.
2025 నాటికి విద్యుత్ కారు
ప్రస్తుతం మొత్తం కార్ల విక్రయాల్లో 1.1 శాతమే విద్యుత్ వాహనాలున్నాయన్నారు. భవిష్యత్తులో వసతులు పెరగడంతోపాటు, బ్యాటరీ ధరలు తగ్గడం, మెరుగైన సాంకేతికత వల్ల విద్యుత్ కార్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉందన్నారు. 2030 నాటికి మొత్తం కార్ల విక్రయాలు 60 లక్షల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, ఇందులో విద్యుత్ వాహనాల వాటా 15-17 శాతం వరకూ ఉండొచ్చని తెలిపారు. 2025 నాటికి మారుతీ సుజుకీ విద్యుత్ కారును తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మొత్తం కార్ల విక్రయాల్లో సీఎన్‌జీ వాహనాలు 12% ఉండగా, ఇందులో మారుతీ వాటా 80 శాతం ఉందని శశాంక్ తెలిపారు.