Twitter revenue 2022: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ట్విట్టర్ గురించే వార్తలు వస్తన్నాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్లో షేర్లు కొనుగోలు చేయడం.. సంస్థ బోర్డులో చేరే విషయంపై తర్జనభర్జనలు.. ఆ తర్వాత మొత్తం కంపెనీనే మస్క్ కొనేయడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్ భవిష్యత్‌పై వివిధ ఊహాగానాలు వస్తున్న వేళ.. ఆ సంస్థ త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి.
జనవరి-మార్చి మధ్య కాలంలో ట్విట్టర్ 1.2 బిలియన్ డాలర్లు (రూ.9,198 కోట్లు) ఆదాయం గడించింది. 513 మిలియన్ డాలర్లు (రూ.3,931 కోట్లు) లాభాన్ని వెనకేసుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 16 శాతం అధికం కావడం విశేషం. అదే సమయంలో, ట్విట్టర్ యాక్టివ్ యూజర్ల సంఖ్య సైతం భారీగా పెరిగింది. ఈ త్రైమాసికంలో సగటున 22.9 కోట్ల మంది ట్విట్టర్లో క్రియాశీలంగా ఉన్నారని సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 16 శాతం అధికమని పేర్కొంది.
Twitter Elon Musk buy: ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ వారమే ఈ ఒప్పందం కుదిరింది. కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన తొలి త్రైమాసిక ఫలితాలు మస్క్‌కు జోష్ ఇచ్చేవేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ ఒప్పందం పూర్తయ్యేందుకు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయని పేర్కొన్నారు.
షేర్హోల్డర్లు సమ్మతి తీసుకోవడం సహా.. అమెరికా, ఇతర దేశాల్లోని నియంత్రణ సంస్థల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాక్స్వాతంత్ర్యంపై మస్క్‌కు ఉన్న అభిప్రాయాలను పలువురు యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మస్క్ వివరణ ఇచ్చినప్పటికీ.. ట్విట్టర్లో వేధింపులు, విద్వేష ప్రసంగాలు ఎక్కువ అవుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కోకకోలా సంస్థపై కన్నేసిన మస్క్.. ట్విట్టర్‌పై కీలక వ్యాఖ్యలు!