ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ సీఈవో రవీంద్రన్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఫెమా నిబంధనల ప్రకారం.. సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. బెంగళూరులో ఉన్న రవీంద్రన్ రెండు కార్యాలయాలతో పాటు ఇంట్లో శనివారం ఉదయం సోదాలు జరిపినట్లు చెప్పారు.
కొందరు బయట వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని ఈడీ అధికారులు తెలిపారు. రవీంద్రన్‌కు పలుమార్లు సమన్లు జారీ చేశామని.. కానీ ఆయన ఈడీ ముందు హాజరు కాలేదని చెప్పారు. 2011-2023లో బైజూస్.. దాదాపు రూ.28,000 కోట్ల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుందని తనిఖీల్లో తెలిసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో రూ.9,754 కోట్లను వివిధ దేశాలకు బైజూస్ బదిలీ చేసినట్లు తెలిపారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ నిధులను స్వీకరించినట్లు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బైజూస్ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదని.. ఖాతాలను ఆడిటింగ్ చేయించలేదని వివరించారు.
ఈడీ దాడులపై బైజూస్ ప్రతినిధులు స్పందించారు. "మా కార్యకలాపాల సమగ్రతపై మాకు అత్యంత విశ్వాసం తప్ప మరేమీ లేదు. ఈడీ అధికారులకు సహకరిస్తాం. వారికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్‌లకు అధిక-నాణ్యత గల విద్యా సేవలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా లక్ష్యంపై దృష్టి పెడుతున్నాం" అని తెలిపారు.
అయితే రవీంద్రన్ కంపెనీలో తన వాటా పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. అందుకోసం కావాల్సిన నిధులను ఆయన ప్రస్తుతం సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ఈ మేరకు వివిధ సంస్థలతో రవీంద్రన్ చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు కంపెనీ ఉద్యోగులు తెలిపారు. కంపెనీలో అదనంగా మరో 15 శాతం వాటాను కొనుగోలు చేయాలని రవీంద్రన్ యోచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 25 శాతం వాటాలున్నాయి. దీన్ని 40 శాతానికి పెంచుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బైజూస్‌ను 2015లో రవీంద్రన్ స్థాపించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియెటివ్, సెఖోయా క్యాపిటల్ ఇండియా, బ్లాక్‌రాక్, సిల్వర్ లేక్ వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థలకు వాటాలున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ 5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. నిజానికి బైజూస్‌ను ఐపీఓకు తీసుకురావాలని కంపెనీ ప్రణాళికలు రచించింది. కానీ, 2022లో టెక్, ఐటీ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడం వల్ల వెనకడుగు వేసింది. మరోవైపు తమ ట్యూటరింగ్ బిజినెస్ ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను సైతం పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్లాలని బైజూస్ యోచిస్తోంది.