ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న తర్వాత జియో సినిమా యాప్‌కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేస్తున్నట్లు సంస్థ చేసిన ప్రకటనతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఏ నెట్వర్క్ వారైనా.. ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారు. దీంతో వ్యూయర్షిప్లో రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ విషయంలో గతంలో నమోదైన రికార్డులన్నీ ఈసారి జియో సినిమా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇకపై ఫ్రీ కంటెంట్ విషయంలో జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల తరహాలో యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ ప్లాట్ఫామ్లో 100 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి తెచ్చిన తర్వాత కంటెంట్‌కు డబ్బులు వసూలు చేయనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ పూర్తైన తర్వాతే జియో సినిమా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో 2023 ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. ఐపీఎల్‌కు ముందు కూడా జియో సినిమా యాప్ ఉన్నప్పటికీ.. యూజర్ బేస్ చాలా తక్కువ. ఐపీఎల్ ప్రసారాలతోనే పెద్ద సంఖ్యలో యూజర్లను పోగు చేసుకుంది జియో సినిమా. అయితే, క్రికెట్ అభిమానులే కాకుండా ఇతర ఆడియెన్స్‌ను ఆకర్షించేందుకు జియో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ఓటీటీలకు పోటీగా జియో సినిమాను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
జియో సినిమాలో కొత్తగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ కంటెంట్ బిజినెస్ విభాగ అధిపతి జ్యోతి దేశ్‌పాండే ఇటీవల వెల్లడించారు. కొత్త కంటెంట్ చేరిన తర్వాత జియో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అయితే, దీనిపై జ్యోతి దేశ్‌పాండే పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఛార్జీల విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఐపీఎల్ ఫైనల్‌కు ముందే.. కొత్త కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయినప్పటికీ ఉచితంగానే ఐపీఎల్‌ను చూడొచ్చని పేర్కొన్నారు.
ఆదాయం పెరిగే ఛాన్స్..
ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించిన తర్వాత ఓటీటీ మార్కెట్లో జియో సినిమా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నాయి. ఉచితంగా ఐపీఎల్‌ను ప్రసారం చేస్తున్న జియో.. తన నెట్వర్క్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను సైతం ఇదివరకే ప్రవేశపెట్టింది. రోజుకు 3జీబీల ప్లాన్లను ప్రత్యేకంగా ఐపీఎల్ వీక్షకుల కోసం అందుబాటులోకి తెచ్చింది. బేస్ ప్లాన్ కాకుండా క్రికెట్ ప్రేమికులకు స్పెషల్‌గా యాడ్-ఆన్ ప్యాక్‌లను సైతం అందుబాటులో ఉంచింది.