విమాన ప్రయాణంలో తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు.. ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీకి వచ్చిన ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ఓ మహిళపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పారిస్-దిల్లీ విమానంలో రెండు వేర్వేరు ఘటనలు వెలుగుచూశాయి. బాత్‌రూమ్‌లో ప్రయాణికుడు సిగరెట్ కాల్చడమూ వివాదస్పదమైంది. దిల్లీ-పట్నా ఇండిగో విమానంలో ఓ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ పట్టుబడ్డారు. ఇలాంటి ఘటనల వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల జరిగిన ఉదంతాల నేపథ్యంలో మద్యం, లావెట్రీ వినియోగం విషయంలో ఉన్న నిబంధనల గురించి తెలుసుకుందాం..
దేశీయంగా లిక్కర్‌కు నో..
దేశీయ విమానాల్లో మద్యం సేవించడానికి అనుమతి లేదు. చాలా ఏళ్లుగా ఈ నిబంధన అమలవుతోంది. కాబట్టి దేశీయ విమాన ప్రయాణాల్లో మద్యాన్ని సేవించడం చట్టరీత్యా నేరం. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఒక్కో విమాన సంస్థ ఒక్కో పాలసీని అనుసరిస్తున్నాయి. ఎయిరిండియా విషయానికొస్తే అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లో కాంప్లిమెంటరీగా మద్యాన్ని సరఫరా చేస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో అంతర్జాతీయంగా ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే మద్యానికి అనుమతి ఉంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో అంతర్జాతీయ విమానాల్లో ఎంపిక చేసిన రూట్లో మూడు క్యాబిన్ క్లాస్‌ల్లోనూ మద్యానికి వీలు కల్పిస్తోంది. తాజా ఘటనల నేపథ్యంలో అంతర్జాతీయంగానూ విమాన ప్రయాణాల్లో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరుగుదొడ్డి ఎప్పుడు పడితే అప్పుడు కాదు..
విమాన ప్రయాణానికి సంబంధించి మరుగుదొడ్డి వినియోగంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మరుగు దొడ్డిని వినియోగించడాన్ని డీజీసీఏ నిషేధించింది. అలాగే కుదుపులకు లోనైప్పుడు సైతం ప్రయాణికులు సీటు బెల్టు ధరించాలి. విమానం సాధారణ స్థితిలో ఎగురుతున్న సమయంలో మాత్రమే వాష్ రూమ్‌లను వినియోగించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.
లెవల్ దాటితే వేటే..
విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల కోసం కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. హద్దు మీరితే తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటారు. నేర తీవ్రతను బట్టి మూడు లెవల్స్‌గా పరిగణిస్తారు. మాటలతో దూషించడం, అవమానించే రీతిలో సంజ్ఞలు చేయడం లెవల్-1 నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి వారిని 'నో ఫ్లై' జాబితాలో చేర్చుతారు. ఆంక్షలు ఎన్ని రోజులు అనేది ఆ విమాన సంస్థ నియమించిన అంతర్గత కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే లెవల్-2 తీవ్రతగా పరిగణించి ఆరు నెలలు పాటు విమాన ప్రయాణంపై నిషేధం విధిస్తారు. ప్రాణ హాని కలిగించినట్లు మాత్రం రుజువైతే లెవల్-3 కింద జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉంది.