Business Success Story : రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఈ కంపెనీ పేరు తెలియని విద్యావంతులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముకేశ్ అంబానీ అధినేతగా గల ఈ సంస్థ దేశంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. దీని మార్కెట్ విలువ రూ.14.63 ట్రిలియన్లు. ముకేశ్ అంబానీ తన అత్యంత సన్నిహితులతో వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఎంతో మంది పనిచేసే ఈ కంపెనీలో అత్యధిక జీతం ఎవరు తీసుకుంటున్నారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అయితే.. దీనికి సమాధానం ఇందులో ఉంది.
రిలయన్స్ వ్యాపారంలో అతి ముఖ్యమైన విభాగం పెట్రో కెమికల్. ఇందులో కెమికల్ ఇంజినీర్‌గా నిఖిల్ మేస్వానీ పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో అత్యధిక జీతం తీసుకునేది ఈయనే. పెట్రో కెమికల్ వ్యాపారం విజయవంతంగా కొనసాగడంలో ముఖ్య పాత్ర వహించిన ఘనత నిఖిల్‌కే దక్కుతుంది. 1986లో రిలయన్స్ కంపెనీలో చేరిన ఆయన.. తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత అనగా 1988 జులైలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు.
ఇంతకీ నిఖిల్ ఎవరు ?
Who is Nikhil Meswani : నిఖిల్ మేస్వానీ ముకేశ్ అంబానీకి బంధువు. ఈయన కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్ లాల్ మేస్వానీ కుమారుడు. నిఖిల్ అన్నయ్య హితల్ మేస్వానీ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక ఆయన చదువు విషయానికి వస్తే.. ముంబయి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో మాస్టర్స్ చేశారు. తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి రిలయన్స్ కంపెనీలో చేరారు. అంతేకాకుండా నిఖిల్ ప్రఖ్యాత యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూఐసీటీ) పూర్వ విద్యార్థి కూడా.
కెరీర్ ఇలా కొనసాగింది..
Nikhil Meswani Career : 1986లో కంపెనీలో చేరిన నిఖిల్ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆయన ప్రాథమికంగా పెట్రో కెమికల్ విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తుండేవారు. ఈ రంగంలో కృషి చేసి పెట్రో కెమికల్స్‌లో రిలయన్స్‌ను అగ్రగామిగా నిలిపారు. 1997 నుంచి 2005 మధ్యలో రిఫైనరీ బిజినెస్ కూడా చూసేవారు. దీనితో పాటు కార్పొరేట్ వ్యవహారాలు, గ్రూప్ టాక్సేషన్ లాంటి బాధ్యతల్నీ నిర్వర్తించారు. అంతేకాకుండా రిలయన్స్ యాజమాన్యంలో ఉండే ఐపీఎల్ ఫ్రాంచైజీ.. ముంబయి ఇండియన్స్ టీమ్, ఇండియన్ సూపర్ లీగ్, సహా కంపెనీ ఇతర క్రీడా కార్యక్రమాల్లోనూ నిఖిల్ మేస్వానీ పాల్గొంటూ ఉంటారు.
జీతమెంత..?
Nikhil Meswani Salary : నిఖిల్ మేస్వానీ 2021 - 2022 సంవత్సరంలో రూ.24 కోట్లు వేతనం తీసుకుని రిలయన్స్ కంపెనీలో అత్యధిక జీతం పొందిన ఉద్యోగిగా నిలిచారు. ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ వేతనం సైతం రూ.15 కోట్లే. దశాబ్ద కాలంగా ఇదే వేతనాన్ని ఆయన తీసుకోవడం విశేషం. కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ అధినేత 2008 - 09 సంవత్సరం నుంచి జీతం, అలవెన్సులు, కమీషన్లు మొత్తం కలిపి రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. కొవిడ్ - 19 మహమ్మారి ప్రభావంతో ఆయన గత రెండేళ్లుగా తన జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కంపెనీ వేతనాల జాబితాలో ఆయన జీతం సున్నా (జీరో)గా ఉంది.