Investment Options : ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తూ, ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉన్న ఈ సమయంలో వడ్డీ రేట్లు పెంచాలా? వద్దా? అని వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఆలోచనలో పడ్డాయి.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు!
Inflationary Risk : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణంలో వస్తున్న ఆనూహ్య మార్పులు, గ్రీన్ఫ్లేషన్ (క్లీన్ ఎనర్జీ వైపు మళ్లడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల ముడిసరుకుల ధరలు పెరగడం), డీగ్లోబలైజేషన్, ఎల్‌నినో ప్రభావం, బలమైన లేబర్ మార్కెట్లు, ఒపెక్ దేశాలు చమురు సరఫరాను నియంత్రించడం ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తాయి. అంటే త్వరలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. అందుకే దీనిని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి.
ఆర్థిక వృద్ధి మందగిస్తున్న తరుణంలో..
Economic depression Risk : కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేందుకు కూడా అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి క్రమంగా క్షీణిస్తూ ఉండడం, తరుముతున్న ఆర్థికమాంద్యం భయాలు, చైనా ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తూ ఉండడం, ఆస్తుల ధరలు దిగివస్తుండడం, రుణాల ఎగవేత అధికమవుతుండడం.. ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే దిశగా ఆలోచన చేయడానికి కారణమవుతాయి.
వడ్డీ రేట్లు పెంచాలా? వద్దా?
Interest Rates will hike or not : ఒక వైపు ప్రపంచ ఆర్థిక వృద్ధి క్రమంగా క్షీణిస్తూ ఉంటే, మరోవైపు ద్రవ్యోల్బణం తరుముకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి క్లిష్టసమయంలో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు విషయంలో వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాలపై సమగ్రమైన సమాచారం ప్రస్తుతానికి లేదు. అందువల్ల ప్రపంచ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర బ్యాంకులు.. పూర్తి డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే వడ్డీ రేట్లు పెంచాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అప్పట్లో..
2022వ సంవత్సరం తరువాత అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ విపరీతంగా వడ్డీ రేట్లు పెంచింది. ద్రవ్యోల్బణం వల్ల ముడిసరుకుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు అధికంగా ఉండడం వల్ల మూలధనం తగ్గింది. ఈ రెండూ కూడా కార్పొరేట్ కంపెనీల లాభాలను దెబ్బతీసాయి. ఫలితంగా స్టాక్మార్కెట్లో షేర్ల ధరలు అమాంతంగా పడిపోయాయి. ఫలితంగా షార్ట్ టెర్మ్ బాండ్స్ కంటే లాంగ్ టెర్మ్ బాండ్స్ మదుపరులు బాగా నష్టపోయారు. డాలర్ విలువ పెరగడం వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు క్షీణించాయి. అదే సమయంలో రూపాయి విలువ క్షీణించడం వల్ల.. భారతదేశంలో బంగారం ధరలు బాగా పెరగడం విశేషం.
వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం వల్ల ఏమౌతుంది?
ప్రస్తుతం కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచాయి. అందువల్ల మార్కెట్లపై మిశ్రమ ప్రభావం కనిపిస్తోంది. కొందరు పెట్టుబడిదారులు రిస్కు చేయడానికి ఇదే సమయం అని ఆలోచిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఇంకా వేచి చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఒక వేళ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచితే.. భారీ నష్టాలు చవిచూసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. వాస్తవానికి ఈ ధోరణి అన్ని రంగాల్లోనూ ఉంది.
ఈక్విటీ vs బాండ్స్ vs బంగారం
Equity vs bond vs Gold : ప్రస్తుత పరిస్థితుల్లో లాంగ్ టెర్మ్ బాండ్స్ కంటే.. షార్ట్ టెర్మ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారు బాగా లాభపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు కూడా లాభాల దిశగా కొనసాగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. బంగారం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ధరలు పెరిగే అవకాశం తక్కువేనని విశ్లేషిస్తున్నారు.
ఒడుదొడుకులు సహజం
ఒక వేళ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే మాత్రం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై నష్టం రావచ్చు. కానీ ఇదే సమయంలో బంగారంపై పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది.
మరోవైపు వడ్డీ రేట్లు తగ్గితే కొన్ని ఆసెట్స్ బాగా పెర్ఫ్మామ్ చేసే అవకాశం ఉంటుంది. హై వాల్యూ షేర్ల విలువ మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో లాంగ్ టెర్మ్ బాండ్లు లాభపడతాయి. కానీ ఒక వేళ రూపాయి విలువ బలపడితే.. దేశీయంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక వేళ ద్రవ్యోల్బణం అధికమైతే.. ఈక్విటీస్, బాండ్స్ కంటే బంగారమే అధిక లాభాలు తెచ్చిపెడుతుంది.
పెట్టుబడులు ఎలా పెట్టాలి?
How to diversify your portfolio : ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో నిర్ణయించుకోవడం చాలా కష్టం. వడ్డీ రేట్లు పెంచుతారా? లేదా? అని మనం చెప్పలేం. అలాగే స్థూల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించలేం. కనుక పెట్టుబడులు పెట్టేముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.